ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో భారత్‌ ఫోర్జ్‌ పెట్టుబడులు - ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదన - BHARAT FORGE LIMITED INVEST IN AP

రాష్ట్రంలో రెండు దశల్లో పెట్టనున్న సంస్థ అనుబంధ కంపెనీ - మందుగుండు, ఆయుధ సామగ్రి తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి

Bharat Forge Limited Investments in AP
Bharat Forge Limited Investments in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2024, 8:02 AM IST

Bharat Forge Limited Investments in AP : రక్షణ రంగంలో ఓ భారీ ప్రాజెక్టు ఏపీకి రాబోతోంది. యుద్ధరంగంలో వినియోగించే ఫిరంగులు, మందుగుండు సామగ్రి తయారుచేసే ప్రతిష్ఠాత్మక సంస్థ భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ (బీఎఫ్‌ఎల్‌) తన అనుబంధ కంపెనీ కల్యాణి స్ట్రాటజిక్‌ సిస్టం లిమిటెడ్‌ (కేఎస్‌ఎస్‌ఎల్‌) ద్వారా పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసింది. అత్యాధునిక డిఫెన్స్‌ ఎనర్జిటిక్స్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ పేర్కొంది.

ఫిరంగులు, ఆర్టిలరీ సిస్టం ప్రొటెక్టెడ్‌ వెహికల్స్, క్షిపణులు, డిఫెన్స్‌ సొల్యూషన్స్, డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్, ఆర్మర్డ్‌ వెహికల్స్‌ అప్‌గ్రేడ్, మందుగుండు సామగ్రి, ఏరోస్పేస్‌ వంటి రంగాలపై దృష్టి సారించినట్లు కేఎస్‌ఎస్‌ఎల్‌ సంస్థ పేర్కొంది. దీంతో పాటు ఆటోమోటివ్, విద్యుత్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, నిర్మాణం, మెరైన్, మైనింగ్, రైల్వే కోచ్‌ల తయారీకి కూడా సంస్థ పరికరాలను సరఫరా చేస్తుందని వివరించింది. రెండుదశల్లో అభివృద్ధి చేసే ప్లాంట్ ద్వారా రూ.2,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సర్కార్​కి ప్రతిపాదించింది. భారతదేశంతో పాటు ప్రపంచదేశాలకూ రక్షణ సామగ్రి సరఫరా చేయనున్నట్లు వివరించింది. దీనిద్వారా స్కిల్డ్, సెమీ స్కిల్డ్‌ కార్మికులుగా 550 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రతిపాదనల్లో వెల్లడించింది.

Defense Project in Madakasira :మొదటిదశ కోసం కనీసం 1000 ఎకరాల భూమి అవసరమని రెండోదశకు మరో 500 ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని గౌడనహళ్లి, ఆర్‌.అనంతపురం గ్రామాల పరిధిలోని భూములను ఇప్పటికే సంస్థ పరిశీలించింది. తయారుచేసిన యుద్ధసామగ్రి సామర్థ్యాన్ని అంతర్గతంగా పరిశీలించడానికి వీలుగా భూములు అవసరమని తెలిపింది.

మొదటిదశలో ప్రతిపాదించిన పనులు :ఏపీలో ఏర్పాటు చేసే ప్లాంటులో మందుగుండు, ఫిరంగుల షెల్స్, రక్షణ రంగ పరికరాలను తయారు చేయనున్నట్లు కేఎస్‌ఎస్‌ఎల్‌ సంస్థ పేర్కొంది. దీనికోసం మొదటిదశలో రూ.1000 కోట్లతో ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కీలక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మందుగుండు సామగ్రి ఎగుమతులపై దృష్టి పెట్టినట్లు ప్రతిపాదనలో వెల్లడించింది. ఆ సంస్థ ప్రతిపాదించిన షెడ్యూల్‌ ప్రకారం..

  • 2024:ప్లాంట్ ఏర్పాటుకు 1000 ఎకరాల భూముల సేకరణ, భవిష్యత్ విస్తరణ కోసం అదనపు భూముల గుర్తింపు
  • 2025:ఏటా రెండు లక్షల ఫిరంగుల్లో మందుగుండు నింపేలా షెల్‌ ఫిల్లింగ్‌ యూనిట్‌. ఏటా 3,500 టన్నుల టీఎన్‌టీ తయారీ ప్లాంట్
  • 2026:గన్‌ప్రొపెల్లెంట్స్‌ (బయో-మాడ్యులర్‌ ఛార్జ్‌ సిస్టం (బీసీఎంఎస్‌) ద్వారా నెలకు 10,000ల నుంచి 20,000ల మాడ్యూల్స్‌ తయారీ ప్లాంట్
  • 2027:ఇతర ఎనర్జిటిక్స్‌ (వార్‌ హెడ్, బాంబుల కోసం పాలిమర్‌తో నిండిన ప్రొపెల్లెంట్‌ల తయారీ. ఏటా 50 టన్నుల రాకెల్‌ ప్రొపెల్లెంట్, ఏటా 50 టన్నుల పాలిమర్‌ బాండెడ్‌ యూనిట్లు)
  • 2029:అడ్వాన్స్‌డ్‌ ఎనర్జిటిక్స్‌ (రాకెట్‌ మోటార్ల కోసం కాంపోజిట్‌ ప్రొపెల్లెంట్లు, హై పెర్ఫార్మెన్స్‌ గన్‌ ప్రొపెల్లెంట్‌)

రెండోదశలో పాలిమర్‌ బాండెడ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్, అడ్వాన్స్‌డ్‌ ఎనర్జిటిక్స్‌ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. వాటికోసం రూ.1,400 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మందుగుండు మార్కెట్‌ గణనీయంగా పెరుగుతోందని, 2023లో ప్రపంచవ్యాప్త ఆయుధ మార్కెట్‌ డిమాండ్‌ రూ.1.29 లక్షల కోట్లలో మందుగుండు సామగ్రి వాటా 53 శాతం అని సంస్థ వెల్లడించింది.

రాష్ట్రానికి రిలయన్స్ రాక - రూ.65వేల కోట్లతో పెట్టుబడుల ప్రణాళికలు

ఏపీలో టాటాపవర్ రూ.40 వేల కోట్ల పెట్టుబడి - టాటా గ్రూప్ ఛైర్మన్​తో సీఎం భేటీ

ABOUT THE AUTHOR

...view details