Best Shopping Malls in Kukatpally :ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని శివారుగా పరిగణించే వారు. అభివృద్ధిలో కూడా పెద్దగా ముందు వరుసలో కనిపించిన ధాఖలాలు లేవు. అపార్ట్మెంట్లు, నివాస ప్రాంతాలు ఉన్నప్పటికీ, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల సంఖ్య పరిమితంగానే ఉండేది. షాపింగ్ చేయాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. హైటెక్‌సిటీకి దగ్గర్లో ఉండటం అన్నిరకాల వనరుల అందుబాటుతో అందరి దృష్టి ఈ ప్రాంతంపై పడింది. తక్కువ సమయంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా నిలిచింది. ఒకప్పుడు చూద్దామన్నా ఒక్క మల్టీప్లెక్స్, మాల్ ఉండేవి కావు. అలాంటి కూకట్‌పల్లిలో నేడు మాల్స్, మల్టీప్లెక్సులకు చిరునామాగా మారింది.
ఫోరం మాల్, మంజీరా మాల్: కూకట్‌పల్లిలో 2008లో జాయింట్ వెంచర్ ప్రాజెక్టులో భాగంగా హౌసింగ్ బోర్డు స్థలంలో ప్రైవేటు సంస్థలు మాల్స్ నిర్మాణాలు చేశాయి. ఇందులో భాగంగా కొద్ది నెలల వ్యవధిలో ఫోరం మాల్, మంజీరా మాల్ అందుబాటులోకి వచ్చాయి. వాస్తవంగా అప్పటి వరకు ఇక్కడ షోరూంలు మాత్రమే ఉండేవి. అతిపెద్ద మాల్స్ నిర్మాణం కావడం వాటిల్లో మల్టీప్లెక్సులు ఉండటంతో ఈ ప్రాంతం ప్రత్యేకంగా అభివృద్థి చెందింది. రెండు మాల్స్ అతి పెద్దవి కావడం ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ కాలనీగా ప్రసిద్ధి చెందిన కేపీహెచ్‌బీకాలనీలో నెలకొనడంతో నగరవాసులను విశేషంగా ఆకర్షించాయి.
మల్టీప్లెక్సులకు ఆదరణ :ఇక్కడికి ప్రజలు అధిక సంఖ్యలో షాపింగ్ చేయడానికి రావడంతో పాటు మల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలన్న కుతూహలం ప్రేక్షకుల్లో పెరుగింది. ఇలా మాల్స్, మల్టీప్లెక్సులకు ఆదరణ విశేషంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత నిజాంపేట జంక్షన్‌లో మరో మల్టీప్లెక్స్ తర్వాత కూకట్‌పల్లి జాతీయ రహదారిని ఆనుకొని రంగధాముని చెరువు సమీపంలో మరో మాల్ నిర్మాణం కావడం అందులోనూ మల్టీప్లెక్స్ ఏర్పాటుతో కూకట్‌పల్లి మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌కు చిరునామాగా మారింది. కొన్ని రోజుల క్రితం మంజీరా మాల్ మూసారు. ఆ తర్వాత లులూ మాల్ రావడంతో అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడికి భారీగా తరలివచ్చారు. దీంతో మాల్ ట్రాఫిక్ పరంగా తీవ్ర ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులు నగరవ్యాప్తంగా చర్చనీయంశంగా మారిన విషయం తెలిసిందే.