Yard Land Value in Hyderabad Begambazar :హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట భూములకు అత్యధిక ధరలు ఉన్న మాట వాస్తవమే. కానీ, అంతకు మించిన ధరలు ఉస్మానియా ఆస్పత్రి సమీపంలోని బేగంబజార్‌లో పలుకుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మాదిరిగా ఇక్కడ భూములకు ధరలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని బేగంబజార్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ హోల్‌సేల్ వ్యాపార హబ్‌గా పేరుగాంచింది. ఇక్కడ స్థలం ధరలు ఆకాశమే హద్దుగా చుక్కలనంటుతున్నాయి.
Yard Land Value in Begambazar (ETV Bharat) రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనీవినీ ఎరుగని స్థాయిలో అందరినీ ఔరా అనిపిస్తున్నాయి. బేగంబజార్ హోల్‌సేల్ మార్కెట్లకు నెలవు. ఇక్కడ గల్లీ, వీధిని బట్టి గజానికి కనీస ధర రూ.10 లక్షలకు తక్కువ కాకుండా పలుకుతోంది. ప్రైమ్ ఏరియాల్లో గజానికి రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షలకు పైమాటే. అత్యంత గరిష్ఠ ధరలు కొనుగోలుదారులకు కొత్తేమీ కాకున్నా చాలా మందికి వింతగా కనిపించడం, వినిపించడం ఆశ్చర్యకర పరిణామం. ఇక్కడ కొత్తగా స్థలాల లభ్యత లేదు. పాతవి, పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలే ఇక్కడి యజమానులకు రూ.కోట్లలో కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
Yard Land Value in Begambazar (ETV Bharat) భూమి లభ్యత లేకపోవడంతో పాత భవనాలే చేతులు మారుతూ నూతన నిర్మాణాలకు పునాది వేస్తున్నాయి. ఆ పాత భవనాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిరంతరం అన్వేషిస్తూనే ఉంటారు. పాత భవనం అమ్మకానికి ఉందన్న విషయం తెలిస్తే చాలు రెక్కలు కట్టుకుని క్షణాల్లో అక్కడ వాలిపోతారు. అందరి కంటే ఎక్కువగా ఇస్తామంటూ పోటీ పడుతుంటారు. ఒకరికి మించి ఇంకొకరు రేటు పెంచుకుంటూ పోతుంటారు. ఈ క్రమంలో వ్యాపారుల మధ్య పోటీ వేలం పాటను తలపిస్తుందంటే నమ్మశక్యం కాదు. భూమి యజమానికి కాసుల పంట కురిపించేలా పోటీ ఉంటుంది. పలు సందర్భాల్లో కొనుగోలుదారుల ఒత్తిడుల వల్ల అమ్మకందారుడు ‘టాస్’ వేసి మరీ ఆ స్థలాన్ని అమ్ముతుండడం విశేషం.
రాష్ట్ర విభజనతో అమాంతం పెరిగిన ధర :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరంగా ఉన్న బేగం బజార్ భూముల ధరలకు 2014 తర్వాత రెక్కలొచ్చాయి. గతంలో గజం భూమి ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు మాత్రమే. విభజనాంతరం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెరిగిపోయింది. ప్రాంతాలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోల్‌సేల్ మార్కెట్లకు బేగంబజార్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన హోల్‌సేల్ వ్యాపారులు ఎంతోమంది తమ వారిని రప్పించుకొని ఇక్కడే స్థిరపడ్డారు. రోజువారీ కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు.
Yard Land Value in Begambazar (ETV Bharat) గజం స్థలం ధరలు లక్షల్లో ఉంటే చదరపు అడుగుల చొప్పున క్రయ విక్రయాలు జరిగే మడిగల (దుకాణాల) ధరలు కూడా రూ.కోట్లలోనే పలుకుతున్నాయి. బేగం బజార్‌లో గజం ధర గరిష్ఠంగా రూ.20 లక్షలు కాగా, చదరపు అడుగు ధర రూ.70 వేలు పలుకుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఐటీ కారిడార్ ప్రాంతాల్లోనూ చదరపు అడుగు (స్క్వేర్ ఫీట్) రూ.20 వేలకు మించి లేదు.
Yard Land Value in Begambazar (ETV Bharat) నిజాం పాలనా కాలంలో వ్యాపారుల రాక :నిజాం పాలన కాలంలో ఉత్తరాది నుంచి వచ్చిన కొంతమంది మార్వాడీ వ్యాపారులు ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. కిరాణా, జనరల్, డ్రై ఫ్రూట్స్, ప్లైవుడ్, స్టీల్, ప్లాస్టిక్, హార్డ్‌వేర్, శానిటరీ, గిఫ్ట్స్, పూజ సామాగ్రి సహా రకరకాల వస్తువులను అమ్ముతున్నారు. దుకాణం చిన్నదైనా హోల్‌సేల్ మార్కెట్‌గా రూపాంతరం చెందింది. కాల క్రమంలో ఉత్తరాది ప్రజలు హైదరాబాద్‌కు వలస వచ్చి బేగంబజార్ కేంద్రంగా చేసుకొని వ్యాపారాన్ని విస్తరించారు. వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించి కొన్ని వేలమందితో బేగంబజార్ నేడు ప్రముఖ హోల్‌సేల్ మార్కెట్‌గా పేరుగాంచింది.
Yard Land Value in Begambazar (ETV Bharat) దాదాపు 5వేలకు పైగా దుకాణాల వరకు ఇక్కడ ఉండగా నిత్యం కొన్ని వేల మంది రిటైల్ కొనుగోలుదారులు ఇక్కడికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వచ్చి కొనుగోళ్లు చేస్తుంటారు. బేగం బజార్ నుంచి ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల ద్వారా నిత్యం వందలాది లారీలు, ప్రైవేటు వాహనాలు, కార్లలో సరకులు రవాణా చేస్తుంటారు.