తెలంగాణ

telangana

ETV Bharat / state

Drone Jobs : పదో తరగతి చదువు చాలు - నెలకు రూ.లక్ష వరకు ఆదాయం

వ్యవసాయంలో డ్రోన్‌ వినియోగంతో నెలకు రూ.లక్ష వరకు సంపాదన - 5 రోజుల్లోనే డ్రోన్‌ పైలట్‌ కావచ్చు - 2030 నాటికి మరిన్ని రంగాలకు డ్రోన్ టెక్నాలజీ విస్తరణగా డీఎఫ్​ఐ కసరత్తులు

Drone Pilot Job Opportunities
Drone Pilot Job Opportunities (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 10:47 PM IST

Drone Pilot Job Opportunity : ‘పెద్ద పెద్ద డిగ్రీ పట్టాలు అక్కరలేదు, పదో తరగతి విద్యార్హత ఉంటే చాలు. ఐదు రోజుల్లోనే ట్రైనింగ్ పూర్తి చేసుకుని సర్టిఫైడ్‌ డ్రోన్‌ పైలట్‌ కావచ్చు.. దీనికి కాస్త శిక్షణను జత చేయగలిగితే.. ఉన్న ఊరిలోనే వ్యవసాయ పనుల్లో డ్రోన్‌ సేవలను అందించడం ద్వారా నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయాన్ని పొందవచ్చు’ అని డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీఎఫ్​ఐ) అధ్యక్షుడు స్మిత్‌ షా తెలిపారు. ఆయన ‘ఈటీవీ భారత్​’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

2030 నాటికి మరిన్ని రంగాలకు
ఇప్పటికే సేవలను అందిస్తున్న రంగాలతో పాటు మరికొన్ని నూతన రంగాల్లోనూ డ్రోన్‌ సేవలు విస్తరించనున్నాయి. భారత సైన్యంతోనూ సమన్వయ, సన్నాహక మీటింగ్ ఇటీవలే జరిగింది. సైబర్‌ సెక్యూరిటీ వంటి వాటిలోనూ డ్రోన్లను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. 2030నాటికి డ్రోన్‌ ఇండస్ట్రీ మార్కెట్‌ రూ.92,500 కోట్లకు (11 బిలియన్‌ డాలర్లు) పెరగనుంది. ఇందులో ఉత్పత్తి, సేవలు, ట్రైనింగ్ ఇతర అన్ని వాణిజ్య వ్యవహారాలూ ఉన్నాయి. వచ్చే పదేళ్లలో డ్రోన్‌ రంగంలో ఇండియా గ్లోబల్‌ లీడర్‌ అవుతుంది.

5 రోజుల్లోనే డ్రోన్‌ పైలట్‌
దేశంలో 400కు పైగా డ్రోన్‌ తయారీ కంపెనీలు ఉన్నాయి. ఇందులో రెండు పెద్ద సంస్థలు మినహా అన్నీ అంకుర సంస్థలే (స్టార్టప్‌లు). కార్గో, అగ్రికల్చర్, రక్షణ, సర్వే-మ్యాపింగ్‌ వంటి ప్రధాన రంగాల్లో ఇప్పటికే డ్రోన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంట్, అకడమిక్, ప్రైవేటువీ కలిపి దేశంలో 120 సర్టిఫైడ్‌ శిక్షణ సంస్థలున్నాయి. ఐదు రోజుల పైలట్‌ కోర్సు ట్రైనింగ్​కు రూ.20 వేల నుంచి రూ.40 వేల మధ్య ఫీజు ఉంటుంది. డ్రోన్లను కూడా ఆన్‌లైన్‌లో గవర్నమెంట్​ వద్ద రిజిస్టర్‌ చేయాలి. ఈ డ్రోన్లను ఆపరేట్‌ చేసే పైలట్‌కు లైసెన్స్‌ కావాలి. థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ సైతం ఉండాలి.

గ్రీన్‌ జోన్‌లో పర్మిషన్ లేకుండానే :డిఫెన్స్ రంగానికి సంబంధించి సున్నితమైన ఇన్‌స్టలేషన్లు ఉన్నచోట (రెడ్‌ జోన్‌గా పిలుస్తారు), విమానాశ్రయాలకు 12 కి.మీ.ల పరిధిలో (ఎల్లో జోన్‌ అంటారు) తప్ప మిగిలిన గ్రీన్‌ జోన్‌లో ఎక్కడైనా ఎలాంటి అనుమతీ (పోలీసుల పర్మిషన్ కూడా) అవసరం లేకుండానే 400 అడుగుల ఎత్తు వరకు డ్రోన్లను ఆపరేట్‌ చేయవచ్చు. దేశంలో 90శాతం ఎయిర్‌స్పేస్‌ గ్రీన్‌జోన్‌గానే ఉండడం డ్రోన్‌ సెక్టార్​కు గొప్ప అవకాశమైంది.

దేశీయంగానే పరికరాలు తయారైతే
రెగ్యులేషన్‌కు (నియంత్రణ) సంబంధించిన ప్రాబ్లమ్స్​ 2021వ సంవత్సరం వరకూ ఎక్కువగా ఉండేవి. 2021లో సెంట్రల్​ గవర్నమెంట్ ఈ నిబంధనలను సరళీకృతం చేశాక సమస్య పరిష్కారమైంది. డ్రోన్‌ టెక్నాలజీ, వీటిలో ఉపయోగించే పరికరాలను పూర్తిస్థాయిలో ఇండియాలోనే తయారు చేసేలా కృషి జరగాలి. చాలా సంస్థలు పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. వీటిని భారత్‌లోనే తయారు చేసే పరిస్థితిని కల్పిస్తే, ఇన్వెస్ట్​మెంట్ వ్యయం తగ్గడమే కాకుండా మార్కెట్‌ రెగ్యులేషన్ కూడా పూర్తిగా మన చేతుల్లో ఉంటుంది. డిజైన్, డెవలపర్‌ భారత్​లోనే అయితే అప్‌గ్రేడెడ్‌ వర్షన్‌లను వేగంగా అందుబాటులోకి తేవచ్చు. విదేశీ కంపెనీలపై ఆధారపడితే, వారు మన అవసరాలకు అనుగుణంగా మద్దతు ఇవ్వవచ్చు.. ఇవ్వకపోవచ్చు. డ్రోన్ల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘పీఎల్‌ఐ’ స్కీం విస్తరణకు మా ఫెడరేషన్‌ తరఫున కొన్ని ప్రతిపాదనలు చేయబోతున్నాం. లాంగ్‌ రేంజ్‌ ఆపరేషన్లకు సెంట్రల్​ గవర్నమెంట్ అనుమతించాలని డ్రోన్‌ పరిశ్రమ ఆశిస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో ఆంధ్రాలో డ్రోన్ల రంగ విస్తరణ
ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వాడకాన్ని పెంచేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి విజన్‌తో ఉన్నారు. ఈ సెక్టార్​ను అభివృద్ధి చేయడంలో ఆయన మాకు ఇచ్చిన ప్రోత్సాహం, శక్తి ఇతర రాష్ట్రాలకూ స్ఫూర్తిదాయకం. సీఎం విజన్‌ను సాకారం చేస్తూ డ్రోన్‌ స్టార్టప్​లను పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి తీసుకువస్తాం. యూజ్‌ కేసెస్‌తో వస్తే వ్యాపారం కల్పిస్తానని సీఎం ఇచ్చిన మద్దతు డ్రోన్‌ ఇండస్ట్రీకి మరింత బలాన్నిచ్చేలా ఉంది. డ్రోన్‌ పరిశ్రమకు, గవర్నమెంట్​కు మధ్య డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారధిగా వ్యవహరిస్తుంది’ అని స్మిత్‌ షా వివరించారు.

భవిష్యత్​ అంతా డ్రోన్​ల మయం
డ్రోన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది, దీంతో నైపుణ్యం కలిగిన డ్రోన్ పైలట్లకు గల అవసరం పెరుగుతోంది. భారతదేశంలో వివిధ రంగాలలో డ్రోన్ పైలట్లకు అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

వ్యవసాయం : డ్రోన్ పైలట్లు రైతులకు పంటల పర్యవేక్షణ, పిచికారీ, కోతలో సహాయం చేయవచ్చు.

రియల్ ఎస్టేట్ : డ్రోన్ పైలట్లు మార్కెటింగ్ ప్రయోజనాల కోసం ఆస్తికి సంబంధించిన అద్భుతమైన ఏరియల్ ఫుటేజ్‌ని క్యాప్చర్ చేయవచ్చు.

సినిమా & మీడియా : డ్రోన్ పైలట్లు సినిమాలు, టీవీ షోలు, వాణిజ్య ప్రకటనల కోసం ప్రత్యేకమైన ఏరియల్ షాట్‌లను క్యాప్చర్ చేయడానికి సినిమా, మీడియా రంగంలో పని చేయవచ్చు.

ఇన్ఫ్రాస్ట్రక్చర్ : డ్రోన్ పైలట్లు వంతెనలు, విద్యుత్ లైన్లు, పైప్‌లైన్‌ల వంటి మౌలిక సదుపాయాల చెకింగ్ సహా పర్యవేక్షణ కోసం ఉపయోగించవచ్చు.

అత్యవసర సేవలు: డ్రోన్ పైలట్లు శోధన, రక్షణ కార్యకలాపాలు, విపత్తు సహాయక చర్యలు సహా అగ్నిమాపక చర్యలలో సహాయం చేయవచ్చు.

భారతదేశంలో డ్రోన్ పైలట్ ఉద్యోగ అవకాశ మార్గాలు

  • జాబ్ పోర్టల్స్ : ఇండీడ్, నౌక్రి, లింక్డ్‌ఇన్ వంటి వెబ్‌సైట్‌లు తరచుగా డ్రోన్ పైలట్ స్థానాల కోసం జాబ్ లిస్టింగ్‌లను కలిగి ఉంటాయి.
  • డ్రోన్ ఇండస్ట్రీ వెబ్‌సైట్‌లు : బోట్స్ & డ్రోన్స్ ఇండియా, డ్రోన్ డెస్టినేషన్ వంటి వెబ్‌సైట్‌లు డ్రోన్ రంగంలో ఉద్యోగ రికార్డులను జాబితా చేస్తాయి.
  • సోషల్ మీడియా : ఉద్యోగ రికార్డుల గురించి తాజా సమాచారం పొందడానికి సోషల్ మీడియాలో డ్రోన్ కంపెనీలు, సంస్థలను అనుసరించండి.
  • నెట్‌వర్కింగ్ : డ్రోన్ కాన్ఫరెన్సులు, ఈవెంట్‌లకు హాజరు కావడం ద్వారా పరిశ్రమ నిపుణులతో నెట్‌వర్క్ చేయవచ్చు.

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన బీబీనగర్‌ ఎయిమ్స్‌ - డ్రోన్‌ సేవలతో మరింత ఈజీగా!

45 నిమిషాల్లో హైదరాబాద్ టు విజయవాడ - విమానంలో మాత్రం కాదు- మరి ఎలాగంటే?

ABOUT THE AUTHOR

...view details