BC Girls Hostel Students Facing Problems In AP : ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఒక చిన్న ఇంట్లో నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడి చిన్నగాండ్లవీధిలో అద్దె భవనంలో కొనసాగిస్తుంటడంతో కనీస వసతుల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ సొంత భవనం నిర్మించుకోడానికి స్థలసేకరణ విషయంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద హాస్టల్ భవనం నిర్మించుకోడానికి ఒక స్థలాన్ని గతంలో అధికారులు పరిశీలించారు. కానీ నేటికీ దాని గురించి ఊసేలేదు.
అద్దె భవనంలో విద్యార్థుల అవస్థలు :పలమనేరు పట్టణంలోనిఈఅద్దె భవనంలోనే మొత్తం 91 మంది విద్యార్థులు ఉన్నారు. జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థినులు ఇందులో ఒక చిన్న హాలులోనే పడుకుంటున్నారు. ఆ పక్కనే ఉన్న చిన్న గదిలోనే భోజనాలు చేస్తున్నారు. మున్సిపల్ కొళాయి ద్వారా వచ్చే నీటినే తాగుతున్నారు. ఇలా వారు పడే అవస్థలు అన్నీఇన్నీకావు. ఇరుకు గదుల్లో చదువుకోవడంతో ఏకాగ్రత లోపిస్తుందని విద్యార్థినులు వాపోతున్నారు. కొత్త భవనం ఏర్పాటుచేయాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు. ఈ భవనం చాలా ఇరుకుగా ఉందని చదువుకోవడానికి చాలా ఇబ్బందికా ఉందని వాపోయారు.
పాత భవనం సమస్యల నిలయం : ప్రతినెలా ఈ భవనానికి ప్రభుత్వం రూ.19 వేలు చెల్లిస్తున్నా కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదు. ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన పాకెట్ మనీ నెలకు రూ.200 కూడా రావడంలేదు. ప్రస్తుతం పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని అగ్నిమాపక కేంద్రం వద్ద స్త్రీశక్తి భవనం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం ఈ భవనాన్ని ఉపయోగించుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు. ఎస్సీ బాలికలకు, బీసీ బాలురకు ప్రత్యేక భవనాలు ఉన్నాయి.