BC Corporations in YSRCP Govt: పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ బీసీలను దశమార్చుతానన్న జగన్ అధికారం చేపట్టగానే తొలి దెబ్బను బలహీనవర్గాలకు అత్యంత కీలకమైన కార్పొరేషన్లపైనే వేశారు. ఏళ్ల తరబడి బీసీలకు అందుతున్న స్వయం ఉపాధి రాయితీ రుణాలకు తిలోదకాలిచ్చారు. బీసీలు సొంత కాళ్లపై నిల్చునేలా ఆర్థికంగా చేయూతనివ్వడం, ఉపాధి కల్పించడం బీసీ ఆర్థిక సహకార సంస్థ లక్ష్యం. బీసీల్లోని వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా వారిని శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడేసేందుకు రాయితీ రుణాలు తిరుగులేని అండనిస్తాయి. సరిగ్గా ఇక్కడే జగన్ దెబ్బ కొట్టారు. వాటి అండ లేకుండా చేశారు.
గత పాలకులంతా స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలిచ్చి, వారికి దన్నుగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లను నామమాత్రంగా మార్చేసింది. తన ఐదేళ్ల కాలంలో రేషన్ పంపిణీ వాహనాలకు 132 కోట్లు రాయితీగా ఇచ్చి మమ అనిపించింది. టీడీపీ హయాంలో నాలుగేళ్లలో ఇచ్చిన 16 వందల 26 కోట్ల రూపాయలతో పోలిస్తే వైసీపీ ఇచ్చింది 8 శాతమే. బ్యాంకు వాటాతో కలిపి మొత్తం 2 వేల 400 కోట్లతో పోలిస్తే 8.3 శాతమే. టీడీపీ ఐదేళ్ల హయాంలో 3.15 లక్షల మంది బీసీలకు సాయం అందింది. వైసీపీ ఏలుబడిలో లబ్ధి పొందిన వారి సంఖ్య 3 వేల800. తన ఐదేళ్ల పాలనలో జగన్ వెనకబడిన తరగతులకు చేసిందేమిటో తేటతెల్లం కావడానికి ఇంతకుమించిన గణాంకాలు ఏం కావాలి.?
బెజవాడలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత అక్రమాలు- బూడిదతో సైతం కాసులు రాల్చుకునే ఘనుడు
కులవృత్తుల వారికి గత ప్రభుత్వాలు 20శాతం నుంచి 50శాతం వరకు రాయితీపై బ్యాంకుల ద్వారా రుణాలు అందించాయి. లక్ష నుంచి 25 లక్షల వరకు రుణాలిచ్చి స్వయం ఉపాధికి ఊతమిచ్చాయి. బీసీ యువత పెద్ద ఎత్తున వీటిని వినియోగించుకుంది. టీడీపీ హయాంలో యాదవుల అభివృద్ధికి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక్కొక్కరికి 5 లక్షల రుణం అందించింది. ఇలా 80 కోట్ల వరకు ఖర్చు చేసింది. 50శాతం రాయితీతో 25 లక్షల రుణమిచ్చి మినీ డెయిరీ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించింది.
ఉపాధి హామీ పథకం కింద గొర్రెలు, గేదెల షెడ్ల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించింది. రజకులు, కల్లుగీత కార్మికులు, వడ్డెరలు, నాయీబ్రాహ్మణులు, వాల్మీకి, ఇతర బీసీ కులాలకు లక్ష రాయితీతో 2 లక్షల రూపాయల వరకు స్వయం ఉపాధి రుణాలు అందేలా చూసింది. ఫలితంగా వేల మందికి చేయూత లభించింది. జగన్ పాలనలో మాత్రం బీసీలకు అడుగడుగునా వంచనే మిగిలింది. బీసీల విషయంలో జగన్ ఐదేళ్లుగా అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు.