New Drug Formula To Prevent Heart Attack :మన శరీరంలోని అవయవాలలో గుండె చాలా ముఖ్యమైనది. ఇది ఆరోగ్యంగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాము. ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న,పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారికి గుండెపోటు వస్తుంది. దీంతో ఆసుపత్రికి తీసుకుని వెళ్లేలోపే చాలా మంది మరణిస్తున్నారు. తాజాగా గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కళాశాల విద్యార్థులు అభివృద్ధి చేశారు.
గుండెపోటు రాకుండా కొత్త ఔషధ ఫార్ములాను ఏపీలోని బాపట్ల ఫార్మసీ కళాశాల ఆచార్యుడు వి.సాయికిషోర్ నేతృత్వంలోని పరిశోధన విద్యార్థులు టి.వాణీ ప్రసన్న,బి.వంశీకృష్ణ, అభివృద్ధి చేశారు. వీరి రూపొందించిన ఫార్ములాకు పేటెంట్ లభించింది. గుండెపోటు ఎక్కువగా మార్నింగ్ సమయాల్లోనే వస్తున్నాయని దాని కారకాలు తెల్లవారుజామున విడుదల కావడమే అందుకు కారణమని తెలిపారు. రాత్రి, ఉదయం సమయాల్లో గుండెపోటు వస్తే ఆ సమయాల్లో బాధితులు వెంటనే మాత్రలు వేసుకోవట్లేదు.
ఈ ప్రతికూలతలను అధిగమించి, కారకాలను నిరోధించేలా ఔషధాలు రూపొందించడంపై ఆచార్యుడు సాయికిషోర్, పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీప్రసన్న చాలా పరిశోధనలు చేశారు. నాలుగున్నరేళ్లకు పైగా శ్రమించి గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతి నిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చని తెలుసుకున్నారు.