Bapatla People Facing Difficulties as Dogs and Cows : రాష్ట్రంలో వీధి కుక్కలు, ఆవుల సమస్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఎక్కడపడితే అక్కడ రహదారుల వెంబడి, రోడ్ల మధ్యలో తిష్ట వేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళ ప్రయాణికులు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వీటి వల్ల కొన్ని సార్లు ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. అలాగే నిత్యం ఏదో ఒక వీధిలో, ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అని తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించిన చోట వీధి కుక్కలు వెంటాడుతూనే ఉన్నాయి, కరుస్తూనే ఉన్నాయి. బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్న గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి వీధి కుక్కలకు సంతాన నిరోధక శాస్త్ర చికిత్సలు, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్లను వేయ్యకుండా కాలయాపన చేసింది. దీంతో వీధి కుక్కలు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా రోడ్లపై స్వైర విహారం చేస్తూ ప్రజలను భయందోళనకు గురిచేస్తున్నాయి.
బాపట్ల పట్టణంలో వీధి కుక్కలు, ఆవుల సమస్య స్థానికులను తీవ్రంగా వేధిస్తోంది. పురపాలక సంఘంలో ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో శునకాలు గుంపులుగా తిరుగుతున్నాయి. పాదాచారులు, వాహనదారులపై దాడులు చేసి కరుస్తున్నాయి. రాత్రి వేళ ప్రయాణికులు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పట్టణంలో ప్రాంతీయ ఆసుపత్రి రోడ్డు, సూర్యలంక రోడ్డు, లక్ష్మీపురం డీఎస్పీ కార్యాలయం రోడ్డు, పాత బస్టాండు, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో వీధి కుక్కలకు సంతాన నిరోధక శాస్త్ర చికిత్సలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వందల సంఖ్యలో శునకాలు పెరిగిపోయాని స్థానికులు మండిపడుతున్నారు. కుక్కలకు కనీసం యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్లను కూడా వేయలేదు. దీంతో కుక్క కాటుకు గురైన కేసులు ప్రాంతీయ ఆసుపత్రిలో రోజురోజుకు పెరుగుతున్నాయి.