BANGLADESH MAN RETURNS TO HOME: బంగ్లాదేశ్‌కి చెందిన ఓ వ్యక్తిని 12 ఏళ్ల తర్వాత కృష్ణా జిల్లా నాగాయలంక పోలీసులు అతని కుటుంబం వద్దకు చేర్చారు. 2013లో నాగాయలంక మండలం నాచుగుంట గ్రామ పరిసర ప్రాంతాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించిన వీఆర్వో, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడికి వెళ్లి అతడిని విచారించగా, సదరు వ్యక్తి పేరు మహ్మద్ మోసలిమ్ ఉధీన్ (సామ్రాట్ మౌంటో బిశ్వాస్) బంగ్లాదేశ్ దేశీయుడు అని గుర్తించారు. అతడు బంగ్లాదేశ్ జాతీయుడని తెలుసుకొని అతని వద్ద భారతదేశంలోనికి రావడానికి ఏమైనా పర్మిషన్ ఉందా అని విచారణ చేశారు. అయితే అతని వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడం వలన, దేశంలోనికి అక్రమంగా చొరబడినట్లు నిర్ధారించిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
పదేళ్లుగా నాగాయలంక పోలీసుల రక్షణలో: న్యాయస్థానం అతడికి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఆ వ్యక్తిని 2015లో జైలు అధికారులు విడుదల చేశారు. శిక్ష పూర్తయిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు అతడిని నాగాయలంక పోలీసుస్టేషన్‌కు పంపారు. అతని బంధువులు ఎవరో తెలియకపోవడంతో సుమారు పదేళ్లుగా నాగాయలంక పోలీసుల రక్షణలో ఉన్నాడు.