Adani Bribe to YS Jagan : సెకితో ఒప్పందం తన ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని వైఎస్సార్సీపీ హయాంలో ఇంధనశాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అర్ధరాత్రి ఒంటి గంటకు నిద్రలేపి సంతకం చేయమన్నారని ఏదో మతలబు ఉందని సంతకం పెట్టలేదని చెప్పారు. అయినా మర్నాడు కేబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారని తెలిపారు. దాని వెనుక అంత గూడుపుఠాణీ ఉందని అప్పడు తనకు తెలియలేదని పేర్కొన్నారు. జగన్‌కు అదానీ ముడుపుల వ్యవహారంపై అప్పట్లో ఏం జరిగిందో బాలినేని ఈనాడు- ఈటీవీ భారత్కి వివరించారు.
సంచలనం రేపుతున్న సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించి నాటి ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. సెకి ఒప్పందం వెనుక ఇంత బాగోతం జరిగిందని నాడు ఊహించలేదని చెప్పారు. మర్నాడు మంత్రిమండలి సమావేశం ఉందనగా అప్పట్లో ఇంధనశాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీకాంత్ అర్ధరాత్రి ఒంటిగంటకు ఫోన్ చేసి సెకితో ఒప్పందం దస్త్రంపై సంతకం చేయమన్నారని బాలినేని పేర్కొన్నారు.
Adani Bribery Case Updates : అంత పెద్ద ఒప్పందంపై తనతో చర్చించకుండా సంతకం చేయమంటున్నారంటే ఏదో మతలబు ఉందనిపించి తాను సంతకం చేయబోనని చెప్పినట్లు బాలినేని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎలా సంతకం పెడతామని తన పీఎస్ అంతకుముందే అప్రమత్తం చేసినట్లు తెలిపారు. కాసేపటి తర్వాత శ్రీకాంత్ తన అదనపు పీఎస్‌కు ఫోన్ చేసి సంతకం పెట్టకుంటే దస్త్రాన్ని కేబినెట్ సమావేశానికి పంపాలని చెప్పారని బాలినేని వివరించారు.
శ్రీకాంత్ చెప్పినట్లే ఉదయమే కేబినెట్ ముందుకు దస్త్రాన్ని తీసుకెళ్లానని బాలినేని పేర్కొన్నారు. మంత్రిమండలి సమావేశంలో ఒప్పందాన్ని ఆమోదించేశారని వివరించారు. తాను ఎక్కడా ఒక్క సంతకం చేయలేదని అంతా పెద్ద మంత్రి నడిపించారని తెలిపారు. అలా తన నిర్ణయాలతో ప్రమేయం లేకుండా ఒప్పందం జరిగిపోయిందన్నారు. అలాంటి ఒప్పందాల గురించి ప్రభుత్వ పెద్దలు తనకెందుకు చెబుతారని వ్యాఖ్యానించారు. అడపాదడపా శ్రీకాంత్ వచ్చి సెకితో ఒప్పందం అని చర్చించేవారని పూర్తి వివరాలు ఎప్పుడూ చెప్పలేదని బాలినేని వెల్లడించారు.
జగన్ కోసం - జగన్ వల్ల - జగన్ చేత! : ఏపీ సర్కార్ 25 సంవత్సరాల పాటు రూ.1,05,825 కోట్ల విలువైన 7000ల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడమంటే ఆషామాషీ విషయం కాదు. దానికి ముందు చాలా పెద్ద కసరత్తు జరగాలి. ఆ ఒప్పందం రాష్ట్రానికి లాభమో, నష్టమో అధికారులు బేరీజు వేయాలి. ఇతర రాష్ట్రాలు ఈ తరహా ఒప్పందాలేమైనా చేసుకుని ఉంటే ధరలపై అధ్యయనం చేయాలి. సంబంధిత మంత్రి, కార్యదర్శి, అధికారులు కూర్చుని మాట్లాడుకోవాలి. నిపుణులతోనూ చర్చించాలి.