Architectural Changes in Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో స్వల్ప వాస్తు మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు వైపున ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన ద్వారం తలుపులను ఆదివారం పూర్తిగా తొలగించారు. ఈశాన్యం గేటుకు తూర్పు వైపున ప్రధాన ద్వారం రానుంది. ఇందుకోసం ఇనుప గ్రిల్స్‌ను తీసేశారు. మిగతా గేట్లను యథావిధిగా ఉంచనున్నారు. డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉండడంతో ఆ లోపు వాస్తు మార్పులు పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
సుమారు రూ.3 కోట్ల 20 లక్షలతో ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోంది. సచివాలయానికి ప్రస్తుతం నాలుగు వైపుల ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపు లుంబినీ పార్క్ ఎదురుగా ఉన్న బాహుబలి గేటు నుంచి మాజీ సీఎం కేసీఆర్ రాకపోకలు జరిపే వారు. ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు రాకపోకలు కొంతకాలంగా నిలిపివేశారు. ఆ మార్గంలోనే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు చుట్టూ లాన్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డును నిర్మిస్తున్నారు.