BAC MEETING : విపక్షాల నిరసన, వాకౌట్ మధ్య అసెంబ్లీలో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ- బీఏసీ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అజెండాతో మధ్యాహ్నం స్పీకర్ ఛాంబర్లో భేటీ ప్రారంభమైంది. అయితే సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. ఆ పార్టీల తరఫున సమావేశానికి వచ్చిన హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, అక్బరుద్దీన్ వాకౌట్ చేశారు. బీఏసీ లేకుండానే 2 బిల్లులు, చర్చ పెట్టడం సంప్రదాయ విరుద్ధమని హరీశ్ రావు మండి పడ్డారు.
బయటకు వచ్చిన తరువాత హరీశ్ రావు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. బీఏసీ లేకుండానే 2 బిల్లులు ప్రవేశపెట్టి, చర్చ పెట్టడం సంప్రదాయ విరుద్ధమని, కనీసం బీఏసీ మీటింగ్‌లో ఎన్ని రోజులు సభ నడుపుతారో కూడా స్పష్టంగా చెప్పడం లేదన్నారు. సభ కనీసం 15 రోజులు నడపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాత్రం 3, 4 రోజులు సభ నడుపుతామని చెబుతోందని ఇలా అయితే ప్రజా సమస్యలపై చర్చ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
రోజూ జీరో అవర్ ఉండాలి : అసెంబ్లీలో ప్రభుత్వ ఆంక్షలపై కూడా హరీశ్ రావు మండి పడ్డారు. తొలిరోజు టీ షర్టులతో వస్తే ఎందుకు ఆపారని మీటింగ్‌లో నిలదీశామని హరీశ్‌రావు తెలిపారు. టీషర్టుతో పార్లమెంటుకు రాహుల్ వెళ్లట్లేదా అని ప్రశ్నించారు. లగచర్ల రైతులకు బేడీలపై చర్చించాలంటే స్పందించట్లేదన్నారు. సభలో పర్యాటకం కంటే లగచర్ల రైతులపై చర్చే ముఖ్యమని చెప్పామన్నారు. ప్రతి రోజూ జీరో అవర్ ఉండాలని కోరినట్లు హరీశ్‌రావు తెలిపారు.