Baby Girl Sale in Guntur :పుట్టబోయే బిడ్డ కోసం ఆ తల్లి గంపెడు ఆశలతో ఎదురుచూసింది. కడుపులో చిన్నారి హాయిగా ఆడుకుంటుంటే ఎంతో సంబురపడింది. పసిపాప రూపాన్ని కళ్ల ముందు తల్చుకుంటూ రోజూ మురిసిపోయింది. ప్రసవవేదనను భరించి ఓ శిశువుకు జన్మనిచ్చింది. కానీ తక్కువ బరువు ఉండటంతో మృతి చెందింది. దీంతో తీవ్రంగా కలత చెందింది. ఎలాగైనా అమ్మ అనిపించుకోవాలని ఆరాటపడింది. ఇందుకోసం ఆ మాతృమూర్తి వేరొకరి ద్వారా ఓ ఆడశిశువును కొనుగోలు చేసింది.
ఆమె కొనుగోలు చేసిన చిన్నారిది మరోక వ్యథ. అమ్మ ప్రేమను అందుకోలేని దీనస్థితి ఆ పాపది. తండ్రి లాలనకూ నోచుకోని దుస్థితి ఆ శిశువుది. దీంతో తండ్రే ఆ పసిపాపను అంగట్లో బొమ్మలా అమ్మకానికి పెట్టాడు. కానీ ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకోవడంతో ఈ గుట్టు కాస్తా రట్టైంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
Guntur GGH Child Sale Case : ఓ ఆడశిశువును విక్రయించిన కేసు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. జీజీహెచ్‌లో భట్టిప్రోలుకు చెందిన మీరాబి అనే మహిళ చిన్నారికి జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ఆ పసికందు మృతి చెందింది. అయితే సోమవారం మీరాబి వద్ద మరో ఆడ శిశువు ఉండటాన్ని గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ జయంతి గమనించారు. దీంతో ఆమెకు అనుమానం కలిగింది. వెంటనే జయంతి ఉన్నతాధికారుల ద్వారా ఈ విషయాన్ని ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కొత్తపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.