తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ తెలంగాణలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత - Prana Pratistha news

Ayodhya Pran Pratishtha Celebrations In Telangana : అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువును రాష్ట్రమంతా పండుగలా జరుపుకున్నారు. చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైన సందర్భాన్ని భక్తజనం శ్రీరాముని జపంతో స్మరించుకున్నారు. ఊరూవాడా శోభాయాత్రలు నిర్వహించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శతాబ్దాల కల నెరవేరిదంటూ బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచి అన్నదాన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆవిష్కరించారు.

Ramayya Shobhayatra Celebrations
Ramayya Prana Pratistha Celebrations In Telangana

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2024, 9:25 AM IST

బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ తెలంగాణలో వెళ్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

Ayodhya Pran Pratishtha Celebrations In Telangana 2024 : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని రాష్ట్ర ప్రజలు వేడుకలా జరుపుకున్నారు. పట్నం పల్లె అనే తేడా లేకుండా శ్రీరామనామ స్మరణతో మార్మోగాయి. సికింద్రాబాద్ హనుమాన్ దేవాలయంలో దీపాలంకరణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మోండా మార్కెట్ వీధుల్లో కాషాయ జెండాలు పట్టిన యువత శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. సనాతన ధర్మాన్ని ప్రధాని మోదీ కాపాడుతున్నారంటూ కీర్తించారు. బేగంబజార్‌లో సీక్వల్ బ్రాహ్మాణ్‌ సమాజ్ ఆధ్వర్యంలో రామకీర్తలు ఆలపిస్తూ సంప్రదాయ నృత్యాల మధ్య శోభాయాత్ర కనుల పండువగా నిర్వహించారు.

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ - భద్రాద్రిలో సీతారాముల శోభాయాత్ర

Ramayya Prana Pratistha Celebrations :కరసేవకుల పోరాట ఫలమే అయోధ్య రామ జన్మభూమి మందిర సాకారమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామమందిర విజయాన్ని దీపాలు వెలిగించి ప్రజలంతా దీపావళి పండగలా జరుపుకుంటున్నారని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బర్కత్‌పురలో కిషన్ రెడ్డి దీపాలు వెలిగించి నాటి కరసేవకుల త్యాగాలను స్మరించుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని జలవాయు టవర్‌లో జరిగిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

"ప్రపంచంలోని 150 దేశాలు కోట్లాది ప్రజలు ప్రత్యక్షంగా లైవ్​ ద్వారా ప్రాణా ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడటం జరిగింది. 500 సంవత్సరాల పోరాట ఫలితంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో మందిరం నిర్మాణం చేయడం జరిగింది. శ్రీరాముడి నామస్మరణతో దేశమంతా మార్మోగింది. ప్రజలంతా ఐక్యమత్యాన్ని ప్రదర్శిచారు. రానున్న రోజుల్లో దేశం మరింత అభివృద్ధి చెందుతుంది."- కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి


Ramayya Prana Pratistha Celebrations In Hyderabad : షాద్‌నగర్‌ నియోజకవర్గవ్యాప్తంగా సీతారాములు, హనుమాన్‌ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటా దీపాలు వెలిగించి, బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. విద్యానగర్‌లో రామాలయ పరిసరాలను కాషాయ జెండాలతో అలంకరించారు. అశోక్‌నగర్‌లో జరిగిన శోభాయాత్రలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ పాల్గొన్నారు. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టతో యావత్ సమాజం పండుగలా జరుపుకున్నారని పేర్కొన్నారు. రాముడిని తిరస్కరించిన కాంగ్రెస్‌కు హిందూ సమాజం భవిష్యత్‌లో తగిన గుణపాఠం చెబుతుందని విమర్శించారు.

అయోధ్య రాఘవుడి ప్రాణప్రతిష్ఠ వేళ - భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు

BJP MP Laxman in Necklace Road : నెక్లెస్‌రోడ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్‌ సనాతన ధర్మాన్ని కించపరిచే వారికి ప్రజాక్షేత్రంలో తిరస్కారం తప్పదని జోస్యం చెప్పారు. జిల్లాల్లోనూ అయోధ్య ఆలయ ఘట్టాన్ని ఇంటి పండుగలా ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆలయాలోనే పూజల్లో పాల్గొన్న భక్తులు రాత్రి వేళ తమ ఇళ్ల ముందు శ్రీరామ అనే అక్షరాలు వచ్చేలా దీపాలను వెలిగించి భక్తి భావాన్ని చాటారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జిల్లాపరిషత్​ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్న రాజ్ కుమార్ అయోధ్య రామాలయం చిత్రాలను కళ్లకు కట్టేలా రూపొందించారు.

Bandi Sanjay In Karimnagar : అయోధ్యలో రామమందిరం సాకారమైన సందర్భాన్ని కరీంనగర్‌ తెలంగాణ చౌక్‌లో ఘనంగా సంబరాలు చేసుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ పాల్గొని జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. కరసేవకుల బలిదానాలు వృథా పోలేదని ప్రధాని మోదీ కసితో పని చేశారని బండి సంజయ్‌ కొనియాడారు. నిజామాబాద్‌ ఖిల్లా రామాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయ ఆవరణలో ముగ్గుతో వేసిన శ్రీ రాముడి ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Ramayya Shobhayatra Celebrations :సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో సీతారామచంద్ర స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భజన మండలి కార్యకర్తలు రాముడి సంకీర్తనలతో అలరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చేపట్టిన శోభాయాత్రలో ఎమ్మెల్యే సునీతా రెడ్డి పాల్గొన్నారు. హనుమకొండ రాంనగర్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు హనుమాన్ భక్తమండలి ఆధ్వర్యంలో కాగడాలతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. జై శ్రీరామ్‌ నినాదాలతో యువత కాషాయపు జెండాలు చేతబూని దీపాలు వెలిగించారు.

రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ శోభాయాత్ర :పరకాలలో శ్రీ సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ వేషధారణలు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంచిర్యాల జిల్లా తాండూరు విద్యాభారతి పాఠశాలలో విద్యార్థులంతా జై శ్రీరాం ఆకారంలో కూర్చుని నీల మేఘశ్యాముడిపై భక్తి ప్రపత్తులను చాటారు. ఖమ్మం జిల్లా మధిరలో జై శ్రీరామ్ నినాదాలతో శోభా యాత్రను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ అక్షింతలు సింగపూర్‌లో నివసిసిస్తున్న తెలుగు భక్తులకు అందజేశారు.

అయోధ్య రామయ్యకు వెల్లువెత్తిన విరాళాలు- 101 కిలోల బంగారం కానుకగా ఇచ్చిన భక్తుడు

'ఎన్నో బలిదానాల తర్వాత మన రాములోరొచ్చేశారు'- ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details