AUTOMATIC DRIVING TESTING TRACK:ఆర్టీఓ ఆఫీసులో ఏమాత్రం పలుకుబడి ఉన్నా గతంలో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేది. టెస్ట్ లో పాల్గొనకపోయినా ఫర్వాలేదు. వచ్చీరాని డ్రైవింగ్ ద్వారా రోడ్డు ప్రమాదాలూ తరచుగా జరుగుతూనే ఉన్నాయి. రోడ్డుప్రమాదాల నివారణకు డ్రైవింగ్ నాపుణ్యాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనన్న ఆలోచనతో రవాణాశాఖ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా సిఫార్సులకు, మధ్యవర్తులకు చెక్ పెట్టినట్లైంది. తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్టులో పాల్గొని అందులో పాస్ కావాల్సిందే. లేదంటే మళ్లీ దరఖాస్తు చేసుకుని టెస్టులో పాస్ అవ్వాల్సిందే.
కర్నూలు శివారు బి.తాండ్రపాడు లోని ప్రాంతీయ రవాణాధికారి ప్రాంగణంలో ఈ మధ్యనే ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్- ఏడీటీటీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీని కోసం 200 మీటర్ల డ్రైవింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. నిత్యం 30 మంది వరకు డ్రైవింగ్ లైసెన్సు పరీక్షల కోసం వస్తున్నారు. డ్రైవింగ్‌లో పూర్తిస్థాయిలో ప్రావీణ్యం ఉన్నవారే ఉత్తీర్ణులవుతున్నారు. ట్రాక్‌పై అవగాహన లేకపోవడం వల్ల పరీక్షలో ఎక్కువమంది తప్పుతున్నారు. డ్రైవింగ్‌లో శిక్షణనిచ్చే పాఠశాలలు సైతం ట్రాక్ ను పరిశీలించి ఇదే విధంగా తర్పీదు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
డ్రైవింగ్ ట్రాక్ చుట్టూ 20 స్తంభాలు ఏర్పాటు చేశారు. ప్రతి స్తంభానికి నాలుగు కెమెరాలు, సెన్సార్ లు, సిగ్నల్ లైట్లు పెట్టారు. ట్రాక్ చుట్టూ ట్రాఫిక్ డివైడర్లు ఉంచారు. డ్రైవింగ్ చేసే వాహనదారుడి వాహనానికి కెమెరాతో కూడిన చరవాణిని ముందు పెడతారు. వాహనదారుడు ట్రాక్ డ్రైవింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యేదాకా కంప్యూటర్‌లో వివరాలు నమోదవుతాయి. వాహనదారుడు ఏమాత్రం సిగ్నల్ జంప్ చేసినా, ట్రాఫిక్ డివైడర్ తాకినా అపసవ్య మార్గంలో వెళ్లినా, ఇండికేటర్లు వేయకపోయినా, కుడి, ఎడమ వైపు మలుపు తిరిగేముందు సిగ్నళ్లు వేయకపోయినా, నాలుగు చక్రాల వాహనదారులు రివర్స్ చేయకపోయినా డ్రైవింగ్ పరీక్షలో అర్హత సాధించడం కష్టమే. వాహనం నడిపే వివరాలన్నీ సెన్సార్ ద్వారా కంప్యూటర్‌లో నమోదవుతాయి.