Attempted Murder Case Against YSRCP Leader Gowtham Reddy :అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఆగడాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. తప్పుడు పత్రాలతో భూములు అక్రమించి నిర్మాణాలు చేపట్టడమేగాక న్యాయపోరాటం చేస్తున్న భూ యజమానిని అంతమొందించేందుకు ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గౌతంరెడ్డి కుట్రపన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Goutham Reddy Land Kabza Allegations in Vijayawada :కన్నుపడిందంటే కబ్జా. అధికారం అడ్డుపెట్టుకుని ఆక్రమించుకోవడం గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రంలో సాగించిన దందా ఇది. కోట్ల విలువైన స్థలాలను తప్పుడు పత్రాలతో వశపరుచుకోవడం, ఎదురు తిరిగిన వారిని అంతమొందించేందుకూ వెనకాడలేదు. విజయవాడలో 5 కోట్ల రూపాయల విలువైన స్థలం కొట్టేసేందుకు ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత గౌతంరెడ్డి కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తనను చంపేందుకు కుట్ర పన్నారంటూ బాధితుడు సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో వారం రోజుల క్రితమే కేసు నమోదు చేయగా సుపారీ తీసుకున్న నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గౌతంరెడ్డి పరారీలో ఉండగా ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
స్థలం కబ్జా చేసి - యజమానిని హత్య చేసేందుకు వైఎస్సార్సీపీ నేత సుపారీ (ETV Bharat) బెజవాడలో భూయజమాని హత్యకు 'సుపారీ గ్యాంగ్' - తెర వెనక వైఎస్సార్సీపీ నేత
విజయవాడలోని సత్యనారాయణపురం శివాలయం వీధికి చెందిన గండూరి ఉమామహేశ్వరశాస్త్రి తల్లి పేరిట లక్ష్మీనగర్‌లో 325 చదరపు అడుగుల 2014లో కొనుగోలు చేశారు. అయితే ఈ స్థలం తమదంటూ గౌతమ్‌రెడ్డి ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేశారని ఉమామహేశ్వరశాస్త్రి ఆరోపించారు. ఏడేళ్లుగా ఈ వ్యవహారంపై ఇరువురి మధ్య వివాదం నడుస్తోంది. అయితే వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా గౌతమ్‌రెడ్డి నగరపాలకసంస్థ నుంచి అనుమతి తెచ్చుకుని గ్రౌండ్‌ప్లోర్‌తో పాటు రెండంతస్తులు నిర్మించారు. దీనిపై ఉమామహేశ్వరశాస్త్రి 2017లో సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టగా గౌతమ్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. బాధితుడు ఎడతెగని న్యాయ పోరాటం చేయగా రెండో అంతస్తు కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మరోసారి హైకోర్టుకు వెళ్లిన గౌతమ్‌రెడ్డి 4 వారాల వరకు యథాతథ స్థితి ఆదేశాలు తెచ్చుకున్నారు.
ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఉమామహేశ్వరశాస్త్రి న్యాయపోరాటం ఆపలేదు. కోట్లాది రూపాయల విలువైన స్థలం చేజారిపోతుందని భావించిన గౌతమ్‌రెడ్డి తన డ్రైవర్ బందా శ్రీను ద్వారా తనను అంతమొందించడానికి కుట్రపన్నారని 24 లక్షలు సుపారీ ఇచ్చారంటూ ఉమామహేశ్వరశాస్త్రి ఇటీవల ఓ వీడియో రిలీజు చేశారు. ఈ నెల 6న మధ్యాహ్నం ఇంటి గోడ దూకి లోపలికి వచ్చి కత్తితో దాడి చేసి ఇంటి స్థలం ఒరిజినల్ పత్రాలు, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యారని బాధితుడు వాపోయాడు. అదే రోజు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా గౌతమ్‌రెడ్డి, బందా శ్రీనుతోపాటు మరో నలుగురిపై హత్యాయత్నం, దోపిడీ కేసు నమోదైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా జగ్గయ్యపేట, చిల్లకల్లుకు చెందిన గెడ్డం వినోద్, తాళ్లూరి గణేష్, దేవళ్ల వంశీ, ఉప్పతోళ్ల అశోక్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు హత్యాయత్నానికి వాడిన ఆయుధం, దోచిన సొత్తులో కొంత స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన గౌతమ్‌రెడ్డితోపాటు మిగిలిన వారు పరారీలో ఉండగా వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాయి.
భూ కబ్జా చేశారో అంతే సంగతులు - కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం