వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళితులపై దాష్టీకాలు - అగ్రస్థానంలో నిలిపిన జగన్! Attacks on Dalits in Andhra Pradesh :ఎవరి ఓట్లతో వైఎస్సార్సీపీ 2019లో అధికారం చేపట్టిందని అందరూ చెబుతారో వారిపైనే తన పాలనలో దమనకాండ సాగించిన నైజం జగన్‌ది. తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు, అణచివేతపై గొంతెత్తితే దౌర్జన్యాలు, హక్కుల కోసం పోరాడితే అక్రమ కేసులు, అన్యాయంపై ఎదురు తిరిగితే హత్యలు భరించలేక పలువురి బలవన్మరణాలు ఇలా 5ఏళ్లుగా దళితులపై మరే రాష్ట్రంలోనూ లేనంత అత్యంత అమానవీయ సంఘటనలు ఏపీలో జరిగాయి. ఈ దుశ్చర్యలకు తెగబడింది వైఎస్సార్సీపీ నాయకులేనని తెలిసినా సీఎం జగన్ నోరు విప్పలేదు. బాధితులను పరామర్శించ లేదు. ఎన్నికల వేళ మాత్రం 'నా ఎస్సీ నా ఎస్టీ' అంటూ మాటల్లో ప్రేమ కురిపిస్తున్నారు. ఇలాంటి దళిత వ్యతిరేక పాలకుడికి అసలు ఎందుకు ఓట్లేయాలి? గత అయిదేళ్లుగా జరుగుతున్న దళిత దాష్టీకాలను మళ్లీ చూడటానికా అన్న ప్రశ్న ఆయా వర్గాల నుంచి వినిపిస్తోంది.
సుబ్రమణ్యం : కాకినాడ జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన వద్ద డ్రైవర్‌గా పనిచేసే దళిత యువకుడు వీధి సుబ్రమణ్యాన్ని చంపేసి, ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారన్న తీవ్ర అభియోగాలు ఎదుర్కొన్నారు. ఆయనను సస్పెండ్ చేయాలంటూ అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తే తప్ప వైఎస్సార్సీపీ అప్పట్లో ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయనకు స్వాగతం పలుకుతూ వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ముఖ్యమంత్రి సభల్లోనూ ఆయన దర్జాగా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున అన్నీ ఆయనే అయి నడిపిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో దళితులకు బతికే హక్కు లేదా జగనన్నా!
డాక్టర్ సుధాకర్ : కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు మాస్కులు లేకుండా వైద్యం ఎలా చేయాలి? అని అడగటమే నేరమన్నట్లు డాక్టర్ సుధాకర్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేధించింది. ముందు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆపై చొక్కా తీసేసి చేతులు వెనక్కి విరిచేసి, తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టించారు. చివరకు మానసిక స్థితి బాగోలేదంటూ పిచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆయన ప్రాణాలొదిలారు. మాస్కు పెట్టుకోకుండా బయట తిరుగుతున్నారంటూ దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ను లాఠీతో చితకబాది అతని మరణానికి కారణమయ్యారు.
ఇండుగుమల్లి వరప్రసాద్ : తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన పాపానికి ఇండుగుమల్లి వరప్రసాద్ అనే యువకుడికి పోలీసుస్టేషన్‌లో శిరోముండనం చేశారు.
న్యాయాధికారి రామకృష్ణ :జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ న్యాయాధికారి రామకృష్ణపై దాడికి పాల్పడ్డారు. అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా హింసించారు. అదే జిల్లాలో అనితారాణి అనే వైద్యురాలిని వేధించి, అసభ్యపదజాలంతో దూషించారు. నా నా అంటూ గుండెలు బాదుకునే జగన్ హయాంలో రాష్ట్రంలో దళితులపై దమనకాండ ఎంత తీవ్రస్థాయిలో జరుగుతుందో చెప్పేందుకు ఇవి కొన్నిఉదాహరణలు మాత్రమేనని చెప్పాలి.
చిన్న అచ్చెన్న :జగన్ సొంత జిల్లాలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న చిన్న అచ్చెన్నను దారుణంగా చంపేశారు. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలంలో ఉపాధి హామీ పథకంలో అధికార వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినందుకు దాసరి వెంకట రమణయ్యను అంతమొందించారు. అనకాపల్లి జిల్లా పీఎల్‌పురం ఎస్సీ కాలనీకి చెందిన 21 ఏళ్ల వడ్లమూరి నాగేంద్రను కాళ్లు, చేతులు కట్టేసి వ్యవసాయ బావిలో పడేసి ప్రాణాలు తీశారు. ఇలా ఒకటా రెండా? తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించినా, అహాన్ని దెబ్బతీసినా, తమకు అడ్డుగా ఉన్నారని భావించినా, ఎదురుతిరిగినా, అక్రమాలపై ఫిర్యాదు చేసినా దళితులను బలి తీసుకున్నారు.
అలపు గిరీశ్‌బాబు :‘‘కాళ్లలో రాడ్లు ఉన్నాయి. కొట్టొద్దు సార్’’ అంటూ అలపు గిరీశ్‌బాబు అనే యువకుడు ప్రాధేయపడ్డా పోలీసులు కనికరించలేదు. ‘‘రాడ్లు ఎక్కడున్నాయో చెప్పు’’ అంటూ లాఠీకి రబ్బరు కట్టి కొట్టి రాక్షసానందం పొందారు. హత్య, మానభంగం, దేశద్రోహం వంటి కేసుల్లో సైతం ఇంత తీవ్రంగా కొట్టేలా చట్టాలు లేవు. ‘ఎస్సై కక్షపూరితంగా, రాజకీయ నాయకుల మెప్పు పొందేందుకే ఇలా చేశారు’ అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు, పోలీసులు కలిసిపోయి గత అయిదేళ్లలో దళితుల్ని ఎంతగా వేధించారో చెప్పేందుకు కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటన చిన్న ఉదాహరణ మాత్రమే.
Anarchies on Dalits: అధికార వైఎస్సార్సీపీ పాలనలో.. దళిత, గిరిజనులపై అరాచకాలు.. నెలకు ముగ్గురి హత్య
దుగ్గిరాల కరుణాకర్ : 20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే వాటిని పట్టుకోనివ్వకుండా వైసీపీ నాయకుడు, శ్రీశైలం ట్రస్టు బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరుడు సురేశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఎస్పీకి లేఖ రాసి నెల్లూరు జిల్లా కావలికి చెందిన దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన తల్లితో కలిసి జగదీశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆ లేఖలో ఆయన వాపోయారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్టల్లా ఆడిన పోలీసులు దళితులను చిత్రహింసలు పెట్టారు. వారిని అవమానించి, మానసిక క్షోభకు గురిచేశారు. వాటిని భరించలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఉదయగిరి నారాయణ :నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన ఉదయగిరి నారాయణ గతేడాది జులైలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయనను పోలీసులు తీవ్రంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేశారని చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుడి కుల సంప్రదాయాలకు భిన్నంగా పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు చేయించడంపై తీవ్ర దుమారం రేగింది.
తప్పు చేసిన వారికి శిక్షపడుతుందనే భయం ఉంటే ఎవరైనా సరే ఆ తప్పు చేయటానికి వెనకంజ వేస్తారు. కానీ ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు తెగబడుతున్న వారికి శిక్షలు పడేలా చేయటంలో జగన్ ప్రభుత్వం అత్యంత ఘోరంగా విఫలమైంది. మెజార్టీ కేసుల్లో అధికార పార్టీ నాయకులే నిందితులుగా ఉండటంతో లోతైన దర్యాప్తు చేయలేదు. శాస్త్రీయ ఆధారాలు సేకరించలేదు. అభియోగపత్రాలు మొక్కుబడిగా దాఖలు చేశారు. ఆ ఫలితంగానే అత్యధిక శాతం కేసులు వీగిపోయాయి. వీటిలోనూ అప్పీలుకు సైతం వెళ్లట్లేదు.
2022లో 1,050 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ పూర్తికాగా కేవలం 42 కేసుల్లోనే శిక్ష పడింది. మిగతా 1,008 కేసులు వీగిపోయాయి. 2021లో నమోదైన 360 కేసుల్లో కేవలం 21 కేసుల్లోనే శిక్షపడింది. మిగతా కేసులు వీగిపోయాయి. 2020లో 371 కేసుల్లో 51 కేసుల్లోనే శిక్షపడింది. మిగతావి వీగిపోయాయి. 2019లో 560 కేసుల్లో 65 కేసుల్లోనే శిక్షపడింది. మిగతావి వీగిపోయాయి.
ఆ ఘనత జగన్‌దే : దళితులపై దాడుల్లో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత జగన్‌దే. మనకంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల్లో కన్నా ఏపీలోనే ఎక్కువ నేరాలు జరిగాయి. 2019 నుంచి 2022 మధ్య ఒక్క ఏడాది మినహా మిగతా అన్ని సంవత్సరాల్లోనూ ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం దళితులపై దాడుల్లో దక్షిణ భారతదేశంలో ఏపీదే తొలి స్థానం.
బాధితులైన దళితులకు రక్షణ కవచంలా ఉపయోగపడాల్సిన ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు, వారిపై కక్ష సాధించేందుకు, అణిచేసేందుకు జగన్ ప్రభుత్వం వినియోగించింది. పోలీసులను అడ్డం పెట్టుకుని దళితులపైనే రివర్స్‌లో ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు బనాయించింది. తన పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి ధాన్యం కొనుగోళ్లలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారంటూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన దళిత రైతు గాలి జూపాల్ పోలీసులకు ఫిర్యాదుచేయగా తిరిగి ఆయనపైనే కేసుపెట్టారు. మూడు రాజధానులకు మద్దతుగా తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న వారిని అడ్డుకుని కులం పేరుతో దూషించారంటూ అమరావతి దళిత రైతులు అయిదుగురిపై ఎట్రాసిటీ కేసు పెట్టి 18 రోజులు జైల్లో ఉంచారు.
పులివెందులలో హత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డీఎస్పీకి ఫిర్యాదు చేయటానికి వెళ్లిన టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎస్సీ వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు ఎంఎస్ రాజులపైన ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం తమకు కేటాయించిన ఎసైన్డ్ భూములను ప్రభుత్వమే లాక్కోవటం ఏంటి? అని ప్రశ్నించినందుకు దళితులపై కేసులు పెట్టారు.
ఐదేళ్లలో దళితులపై నేరాలు గణనీయంగా పెరిగాయి. 2020తో పోలిస్తే 2021లో 3.28 శాతం మేర, 2021తో పోలిస్తే 2022లో 14.94 శాతం మేర నేరాలు పెరిగాయి. 2021లో దళితులపై మొత్తం 2014 నేరాలు జరగ్గా.. వాటిలో 2076 మంది బాధితులయ్యారు. 2022లో 2,315 నేరాలు చోటుచేసుకోగా 2,431 మంది బాధితులయ్యారు.
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి :ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైఎస్సార్సీపీ గతేడాది మార్చిలో సస్పెండ్ చేసింది. ఆ వెంటనే వైసీపీ శ్రేణులు ఆమె కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. సామాజిక మాధ్యమాల్లో ఆమెను, కుటుంబ సభ్యులను కించపరుస్తూ, అసభ్యకరంగా ట్రోలింగ్ చేశాయి. వైసీపీ మద్దతు ఉన్న నాయకులు దళితులపై ఎంతటి తీవ్రమైన నేరానికి పాల్పడినా వారికి జగన్ అన్ని రకాలుగా అండదండలు అందించారు. అదే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే చాలు దళిత నాయకులపైనా దాడికి పాల్పడ్డారు.
Attacks On Dalits: దళితులపై దారుణాలకు అంతెక్కడ..? ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంత..?