Edupayala Jathara In Medak District :మంజీరా నది తీరాన రాతిగుహలో వెలిసిన మెదక్ జిల్లాలోని వనదుర్గమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఏటా మహాశివరాత్రి పర్వదినాన నిర్వహించే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. బుధవారం వనదుర్గమ్మకు మంత్రి దామోదర రాజనర్సింహ పట్టువస్త్రాలు సమర్పించి వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. 3 రోజులు పాటు కనులపండువగా జరిగే జాతరకు సర్వం సిద్ధం చేశారు.
పంచామృతాభిషేకంతో : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తొలిరోజు బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు వనదుర్గ అమ్మవారికి పంచామృతాభిషేకం చేపట్టి ప్రత్యేకంగా అలంకరిస్తారు. సహస్రనామార్చన, కుంకుమార్చనల అనంతరం 5.30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. రెండో రోజైన గురువారం సాయంత్రము ప్రధాన ఘట్టం బండ్ల ఊరేగింపు ఉంటుంది. చివరి రోజైన శుక్రవారం రాత్రి రథోత్సవాన్ని చేపడతారు.
ఆలయం ముందు నదీపాయలో ఏర్పాటు చేసిన శివలింగం ప్రతిమ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఏర్పాట్లలో భాగంగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి వాటిపై టెంట్లు వేశారు. స్నానఘట్టాల వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు, తలానీలాలకు తాత్కాలికంగా టెంట్లును ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
వివిధ వసతులు : మిషన్ భగీరథ ఆధ్వర్యంలో 144 యూనిట్ల తాగునీటి నల్లాలు, 440 తాత్కాలిక శౌచాలయాలు, భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి నదీపాయల వద్ద 12 స్నానాలకు జల్లు స్నానాల పరికరాలను ఏర్పాటు చేశారు. భక్తులకు నీటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా 27 ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు. చెత్త సేకరణకు 8 ట్రాక్టర్లతో పాటు, 5 ఆటోలు, 598 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు.
పక్కాగా నిఘా :జాతర పరిసరాలలో 100 సీసీ కెమెరాలను బిగించారు. మద్యం అమ్మకాల నిరోధానికి ఆబ్కారీశాఖ కంట్రోల్ రూంతో పాటు రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. 9 సంచార బృందాలను(మొబైల్ టీంలను) నియమించారు.