Nara Chandrababu Naidu Oath Ceremony as CM on June 12th :కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి సమీప కేసరపల్లిలో ఎన్‌హెచ్-16 పక్కనే ఐటీ పార్కు ప్రాంగణం వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు తుదిదశకు చేరాయి. ప్రధాన వేదిక నిర్మాణం సోమవారానికి పూర్తికాగా సీటింగ్ ఏర్పాట్లు, గ్యాలరీల పనులు కొనసాగుతున్నాయి. 11.18 ఎకరాల ప్రైవేటు భూమిలో ప్రధాన వేదిక సిద్ధమవుతోంది. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా పూర్తిగా పైకప్పు వేస్తున్నారు.
వీఐపీలకు నాలుగు గ్యాలరీలు కేటాయించగా, మిగిలిన ప్రాంగణంలో సాధారణ ప్రజలు కూర్చునేందుకు సీటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. సాయంత్రానికి ప్రధాన వేదికను పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించే పనులు కూడా పూర్తి చేయనున్నారు. సభా ప్రాంగణంతో పాటు రహదారుల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అమర్చారు. ఇప్పటికే ప్రాంగణం పోలీసులు, ఎన్‌ఎస్‌జీ ఆధీనంలో ఉంది. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. జనరేటర్ల తరలింపు, విశ్రాంతి గదులు, వైద్య శిబిరాల పనులు ఇప్పటికే పూర్తిచేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల మీదుగా వెళ్లే పలు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఆంక్షలు విధించారు. ఇవి మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయి.
సభ ఏర్పాట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం సమీక్షించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాల్ని చంద్రబాబుకు సీఎస్, డీజీపీలు వివరించారు. పార్టీ తరఫున చేస్తున్న ఏర్పాట్లను అచ్చెన్నాయుడు తెలిపారు.