Argument In Ananthapur:అనంతపురం నగరపాలక సమావేశంలో సభ్యుల మధ్య రసాభాస చోటుచేసుకుంది. నగరపాలక సంస్థకు చెందిన భూములు కబ్జాలకు గురవుతున్నాయనే అంశాన్ని తరచూ పలు సమావేశాల్లో లేవనెత్తినప్పటికీ దానికి పరిష్కారం చూపలేదని పలువురు కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కౌన్సిల్ కోఆప్షన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి సైతం తన ఆందోళన వెళ్లగక్కారు. ప్రజా సమస్యల మీద మాట్లాడనివ్వడం లేదని ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసింది కాదని, కేవలం వైఎస్సార్సీపీ లాభార్జన కోసం మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. దీంతో ఇది ఇరువురి సభ్యుల మధ్య గొడవకు దారి తీసింది.
ఇరుపార్టీల మధ్య సాగిన వాగ్వాదం:కార్పొరేటర్ల మధ్య జరుగుతున్న వివాదాన్ని సద్దుమణిగించేందుకు పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ప్రజా సమస్యలు లేవనెత్తిన కార్పోరేటర్లను పోలీసులు బలవంతంగా కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. మేయర్ పోలీసులతో సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. నగర వీధుల్లో ఉన్న కుక్కల అంశంపై కాసేపు వాగ్వాదం నెలకొంది. నలుగురు కార్పొరేటర్లకు కుక్కలు కరచినా అధికారులు సమస్యను పరిష్కరించలేదంటూ ప్రశ్నించారు. కబ్జాకి గురైన సెంట్రల్ పార్కు స్థలం విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కోఆప్షన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి ప్రశ్నించారు. అయితే లక్ష్మీరెడ్డి సలహాలు మాత్రమే ఇవ్వాలి కానీ ప్రశ్నించకూడదని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ చెప్పడంతో లక్ష్మీరెడ్డి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కోఆప్షన్ సభ్యుడికి నగరపాలిక సమావేశంలో మాట్లాడటానికి వీలు లేదా అంటూ ప్రశ్నించారు.