Story On Crops Cultivation In Mahbubnagar : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వానాకాలం సీజన్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. కానీ వానాకాలం పంటల సాగు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అధిక వర్షపాతాలు నమోదు కాగా నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. పంటల సాగు మాత్రం సాధారణ సాగువిస్తీర్ణంతో పోల్చితే మహబూబ్ నగర్ జిల్లాలో 53శాతం, నారాయణపేట జిల్లాలో 83శాతం, నాగర్ కర్నూల్ జిల్లాలో 53శాతం, వనపర్తి జిల్లాలో 41శాతం, జోగులాంబ గద్వాల జిల్లాలో 61శాతం మాత్రమే సాగయ్యాయి.
భూగర్భ జలాలు గత ఏడాదితో పోల్చితే తక్కువగా ఉండటం, చెరువులు,కుంటలు, బోరుబావుల్లో ఆశించిన మేర నీరు లేకపోవడం అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో గత ఏడాది జూలైతో పోల్చితే 2.56 మీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 1.86, జోగులాంబ గద్వాల జిల్లాలో 1.52, నారాయణపేట జిల్లాలో 1.68, వనపర్తి జిల్లాలో 1.11 మీటర్ల లోతుకు భూగర్భ జలమట్టాలు పడిపోయాయి.
Farmers who Cultivate Cotton In Less Area :వర్షపాతం అత్యధికంగా నమోదైనప్పటికీ పంటలకు అనుకూలంగా లేకపోవడంతో ఎక్కువమంది రైతులు సాగువైపు ఆసక్తి చూపలేదు. ఆ కారణంగా ఈసారి పంటల సాగు సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చితే తగ్గిందని తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి సాగు గణనీయంగా తగ్గింది. సుమారు 9లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేసే వాళ్లు. కానీ ఈసారి పత్తి సాగు 6లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది.
గత ఐదారేళ్ల నుంచి పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తగ్గిన దిగుబడి, మార్కెట్ ధర, ప్రకృత్తి విపత్తుల కారణంగా ఏర్పడిన నష్టాలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది రైతులు ఈసారి పత్తిని సాగు చేయలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడంతో పత్తి సాగు గణనీయంగా పడిపోయందని అంచనా.