Special Story On Moo Chuu India Footwear Founder :ఇంటి ముందుకు కూరగాయలు, పండ్లు తెచ్చి అమ్మడం సర్వసాధారణం. అక్కడక్కడ తినుబండారాలు, వస్త్రాలు వంటివి విక్రయించడమూ చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి ఒక ఆలోచనే ఓ యువకుడి మదిలో మెదిలింది. చెప్పులను కూడా కష్టమర్ల చెంతకు చేర్చాలనకున్నాడు. తోటి స్నేహితులు, కుటుంబసభ్యుల సహకారంతో మూచూ ఇండియా కంపెనీ స్థాపించి యువ వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు.
Architect Turned Entrepreneur : పాదరక్షలు వ్యాపారం చేస్తున్నఇతని పేరు కౌశిక్ రెడ్డి. హైదరాబాద్ స్వస్థలం. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. ఆ తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఒకానొక సందర్భంలో థాయ్‌లాండ్ వెళ్లినప్పుడు అక్కడున్న పాదరక్షలను కొనుగోలు చేశాడు. అవి ఎక్కువ కాలం మన్నిక రావడంతో భారత్‌లో కూడా అలాంటి కంపెనీ స్థాపించాలనే ఉద్దేశంతో 2018లో 'మూచూ ఇండియా' పేరుతో దుకాణాన్ని ప్రారంభించాడు.
"కస్టమైజేషన్ అనేది మా బ్రాండ్‌లో ఉన్న ప్రత్యేకత. మాకు బ్రాండింగ్ అనేది ఎక్కడా లేదు. కొన్నవాళ్లు చెప్పడం ద్వారా మా వద్దకు వచ్చేవారు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం డబుల్ కస్టమైజేషన్‌ను ప్రవేశపెడుతున్నాం. వినియోగదారులకు నచ్చే చెప్పులను ఎంచుకునే సౌలభ్యం ఉంది"- కౌశిక్ రెడ్డి,
మూచూ ఇండియా కంపెనీఫౌండర్
Moo Chuu India Footwear company :అప్పటికే మార్కెట్లో కుప్పలు తెప్పలుగా చెప్పుల దుకాణాలు ఉన్నాయి. అందులో తన కంపెనీ నిలదొక్కుకోవడం ఎలాగని ఆలోచించాడు కౌశిక్. కూరగాయలు, పండ్ల మాదిరి నగరంలోని వీధుల్లో, కూడలీల్లో తిరుగుతూ పాదరక్షలు విక్రయించడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 3 వాహనాల ద్వారా అమ్మకాలు జరుపుతున్నామని 'మూచూ ఇండియా' కంపెనీ వ్యవస్థాపకుడు కౌశిక్ తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాల్లో 50 స్టోర్లు ప్రారంభించడమే లక్ష్యం :కంపెనీ ప్రారంభంలో కొన్ని రకాల పాదరక్షలు మాత్రమే లభించేవని కౌశిక్ అంటున్నారు. ప్రస్తుతం చాలా రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. తక్కువ ధరలోనే స్టైలిష్ పాదరక్షలను కష్టమర్లు అందిస్తున్నామని చెబుతున్నారు. సింథటిక్ రబ్బర్‌తో వీటిని తయారు చేస్తున్నామని తెలిపారు. వాహనాలు, స్టోర్‌లతో పాటు వైబ్‌సైట్ ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్లు ఈ వ్యాపారవేత్త చెబుతున్నారు.