APSRTC Planning to Free Service to Women and Recruit Jobs :మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ పథకాన్ని పకడ్బంధీగా అమలు చేయాలని సంకల్పించిన ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఓ వైపు కొత్త బస్సులను రోడ్డెక్కిస్తూనే సిబ్బంది కొరతపైనా దృష్టి పెట్టింది. మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించాక డ్రైవర్లు, కండక్టర్ల కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలపై నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం అవసరమైన పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది.
వైఎస్సార్సీపీ హయాంలో ఏపీఆర్టీసీ (APSRTC) ధ్వంసమైంది. ప్రభుత్వంలో విలీనం పేరిట ఉద్యోగులను నిలువునా మోసం చేసిన గత ప్రభుత్వం ప్రయాణికులనూ అష్టకష్టాల పాలు చేసింది. ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల ప్రయోజనాలకు తూట్లు పొడిచింది. ఐదేళ్లలో ఆర్టీసీలో ఒక్క రెగ్యులర్ ఉద్యోగి నియామకం జరగలేదు. చనిపోయిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన ఉన్నా పట్టించుకోలేదు.
వేలాది మంది నిరుద్యోగులు సైత ఆర్టీసీ ఉద్యోగాల కోసం ఎదురుచూసినా నిరాశే మిగిలింది. గతంలో కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ ఎండీ, పాలక మండలికి స్వేచ్ఛ ఉండేది. ప్రభుత్వ అనుమతితో అవసరమైన మేరకు డ్రైవర్లు, కండక్టర్లను ఒప్పంద లేదా రెగ్యులర్ విధానాల్లో నియమించుకునేవారు. విలీనం తర్వాత ఉద్యోగుల సంఖ్య తగ్గించేశారు. ఐదేళ్లలో ఉద్యోగుల సంఖ్య సుమారు 9వేలకు పైగా తగ్గిపోయింది.
వీడెవడండీ బాబూ - తాగేసి ఏకంగా బస్సు టాప్‌పైనే పడుకుని ప్రయాణించాడు
సిబ్బంది కొరత సాకుగా చూపి 1500 బస్సులు తగ్గించేశారు. సంస్థలో కీలకమైన డ్రైవర్లు, కండక్టర్లు పోస్టులనైనా భర్తీచేయాలని గత ప్రభుత్వాన్ని ఆర్టీసీ ఎండీ సహా ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు కోరినా అప్పటి సీఎం జగన్ చెవికెక్కించుకోలేదు. డొక్కు బస్సులు ఓ వైపు, సిబ్బంది కొరత , అనుభవం లేని కాల్ డ్రైవర్ల వల్ల ప్రమాదాలు పెరుగుతుండటంతో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా మారింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అడ్డగోలు విధానాలతో రోడ్డున పడ్డ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకురావాలని సంకల్పించిన కూటమి ప్రభుత్వం అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికుల ఆదరణ పెంచేందుకు మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని వీలైనంత త్వరలో అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే సంస్థలో దశలవారీగా 1450 కొత్త బస్సులను రోడ్డెక్కిస్తోంది. ఇదే సమయంలో ప్రమాదాల నివారణ సహా, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఖాళీల భర్తీపై దృష్టి పెట్టింది.
పథకం అమలు చేశాక పెద్దఎత్తున ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించనున్న పరిస్ధితుల్లో ప్రమాదాలకు ఏ మాత్రం తావివ్వకుండా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ చేయాలని భావిస్తోంది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు ఇవ్వాలన్న రాష్ట్రప్రభుత్వం ఆదేశాలతో ఉన్నతాధికారులు నివేదికను పంపారు. సంస్థలో 18 కేటగిరీల్లో 7,545 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తేల్చి వీటిని భర్తీ చేయాలని నివేదికలో ప్రభుత్వాన్ని కోరారు. RTCలో అనుభవం, నైపుణ్యమున్న డ్రైవర్లు సరిపడా లేక అవస్తలు పడుతున్నామని, ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు 3 వేల 673 రెగ్యులర్ డ్రైవర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు దృష్ట్యా ఖాళీగా ఉన్న 1813 కండక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని కోరారు. బస్సులను మరమ్మతులు చేసేందుకు బస్ డిపోల్లో పనిచేసే అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్‌లు 579 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. వీరిని పర్యవేక్షించేందుకు 207 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీలు, 179 మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీలు అవసరమని కోరారు. మూడు విభాగాల్లో 280 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కోరారు. ఈ దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
గతంలో ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నందున సొంతంగా భర్తీ చేసుకునేది. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం కావడం వల్ల ప్రభుత్వమే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. నియామకాల బాధ్యతను ఏపీఎస్ఆర్టీసీకి ఇవ్వాలా లేక ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టాలా అనే విషయమై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. వీలైనంత త్వరలోనే సానుకూల నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఖాళీ పోస్టులు భర్తీ చేయడం సహా అవసరమైన కొత్త బస్సులు ఏర్పాటు చేశాకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఫోన్ పే కొట్టు - ఆర్టీసీ టికెట్ పట్టు - చిల్లర సమస్యలకు చెక్