Tuni RTC Driver Lovaraju Issue : చిన్న రోడ్డు ఎదురుగా ట్రాక్టర్ ముందుకెళ్లలేని పరిస్థితి. ఏం చేయలేక ఆ ఆర్టీసీ డ్రైవర్ బస్సును నిలిపేశాడు. ఈలోగా ప్రయాణికులకు వినోదం పంచడానికి సరదాగా కాసేపు నృత్యం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. నెటిజన్లు కూడా సూపర్ డ్యాన్స్ అంటూ కామెంట్లు పెట్టారు. ఇది కాస్తా ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు కేటాయించకుండా డ్రైవర్‌ను పక్కనపెట్టారు. ఈలోగా డ్యాన్స్ వీడియో మంత్రి లోకేశ్ దృష్టికెళ్లడం ఆయన డ్రైవర్ డ్యాన్స్‌ను ఎక్స్ వేదికగా ప్రశంసించారు. దీంతో అతనికి ఈరోజు నుంచి విధులు కేటాయిస్తూ అధికారులు రైట్‌రైట్ చెప్పేశారు. ఇదీ కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు కథ.
లోవరాజు తుని ఆర్టీసీ డిపోలో పొరుగు సేవల విధానంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24న రౌతులపూడి నుంచి తుని డిపోకు బస్సు వెళ్తుండగా మార్గం మధ్యలో కర్రల లోడు ట్రాక్టర్ అడ్డుగా నిలిచిపోయింది. దీంతో బస్సును నిలిపివేశారు. ఈ సమయంలో ఓ యువకుడు వీడియో తీస్తుండగా లోవరాజు బస్సు ముందు నిల్చొని డ్యాన్స్ చేశాడు. దీంతో లోవరాజుకు అధికారులు తాత్కాలికంగా విధులు కేటాయించలేదు.