APSFL Proposals for BharatNet Project Expansion: ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌నెట్ ప్రాజెక్టును మరింత విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ఏపీ మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ కోరారు. ఈ మేరకు దిల్లీలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్‌ను ఏపీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కార్యదర్శి సురేశ్‌కుమార్, ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ కె. దినేష్‌కుమార్‌లు కలిసి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారత్ నెట్ ప్రాజెక్టు అమలుపై కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు నివేదిక సమర్పించారు. భారత్ నెట్ ప్రాజెక్టును మరింత విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని సురేష్ కుమార్ కోరారు. భారత్ నెట్ సమర్ద వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ (Customer Premise(s) Equipment) బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భారత్ నెట్ రెండో దశలో భాగంగా మల్టీ ప్రొటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ టెక్నాలజీ కోసం ఖర్చు చేసిన 650 కోట్ల రూపాయలు ఏపీకి తిరిగి చెల్లించాలని అధికారులు కోరారు.