Telangana DSC Exam Hall Ticket Issue: ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించి హాల్ టికెట్లను విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసింది. గత కొంతకాలంగా పరీక్షలను వాయిదా వేయాలంటూ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. తాజాగా హాల్‌టికెట్ల విషయంలో విద్యాశాఖ తీరుపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తాము ఒక జిల్లాలో దరఖాస్తు చేసుకుంటే, మరో జిల్లాలోని పోస్టుకు ఆప్షన్లు ఇచ్చుకున్నట్లుగా చూపించడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్ష కోసం జారీ చేసిన హాల్‌టికెట్ల గందరగోళంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఒక జిల్లాలో డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి, మరో జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా హాల్ టికెట్‌లో రావడంతో అభ్యర్థులు కంగుతింటున్నారు. ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన శ్రీపెల్లి జ్యోత్స్న మంచిర్యాల జిల్లాలో ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఈ నెల 19న డీఎస్సీ పరీక్ష ఉండగా, ఆమె నల్గొండ జిల్లాలో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు హాల్ టికెట్ జారీ అయ్యింది. పరీక్ష కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లా మావలలో కేటాయించారు.