Signature Campaign for AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఏపీ టుమారో సంస్థ చేస్తున్న సంతకాల సేకరణకు అశేష స్పందన లభించిందని ఆ సంస్థ అధ్యక్షుడు చక్రవర్తి అన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఏబీవీ సస్పెన్షన్ను తప్పు బట్టిందని గుర్తు చేశారు. రెండో సారి సస్పెన్షన్ చేయటం నిబంధనలకు విరుద్ధమంటూ క్యాట్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటివరకు 87 దేశాల నుంచి 35 వేల మందికి పైగా సంతకాల సేకరణకు మద్దతు తెలిపారన్నారు. సంతకాల సేకరణ నివేదికను ఈసీకి పంపామన్నారు. త్వరలో వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయబోతున్నారని తెలిపారు.
AB Venkateswara Rao suspension Issue: కాగా ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు నిలిపివేత పిటిషన్‌పై ఈ నెల 23న హైకోర్టులో విచారణ జరిగింది. ఏబీ వెంకటేశ్వరరావుని రెండో సారి సస్పెండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈ నెల 8వ తేదీన క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది.
క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టుకు సీఎస్:గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ, విచారణ జరిపిన క్యాట్ ఒకే అభియోగంపై రెండు సార్లు సస్పెండ్ చేయడం చెల్లదని స్పష్టం చేసింది. సస్పెన్షన్ను ఎత్తివేస్తూ తక్షణం బాధ్యతలు అప్పగించాలని, వేతన బకాయిలు సైతం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించింది. ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురిచేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి క్యాట్ తీర్పు మింగుడుపడకపోవడంతో, అనంతరం హైకోర్టులో వ్యాజ్యం వేసింది.