Andhrapradesh Liquor Prices 2024 : ఈ నెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. ఈ తరుణంలో భారత్లో తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) బాటిల్ ఎమ్మార్పీ ధరపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీజును విధిస్తూ సవరణ చేసింది. దీన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు. ఆయన ఆమోదం మేరకు గెజిట్ నోటిఫికేషన్ను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా విడుదల చేశారు. అదననపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరల్లో చిల్లర కాకుండా రూ.10 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది.
ఎలా లెక్కిస్తారు : ఈ లెక్కన చూసుకుంటే బాటిల్ ఎమ్మార్పీ ధర 150.50 ఉంటే దాన్ని రూ.160కి పెంచుతారు. పెంచిన ఈ రూ.10 ప్రివిలేజ్ ఫీజు. క్వార్టర్ బాటిల్ ధర రూ.90.50గా ఉంటే ఏపీఎఫ్ కలిపి దాని ధర రూ.100 అవుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వార్టర్ బాటిల్ ధర రూ.99కే నిర్ధారించారు. అందుకే రూ.100 ధరలో రూ.1ని మినహాయించి విక్రయిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.