ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోగి రమేష్, ఆయన కుటుంబసభ్యుల పాపం పండింది: మంత్రుల ధ్వజం - AP MINISTERS ON JOGI RAJEEV ARREST - AP MINISTERS ON JOGI RAJEEV ARREST

AP MINISTERS ON JOGI RAJEEV ARREST: అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసినట్లు ఆధారాలున్నందునే జోగి రమేష్ కుమారుడ్ని అరెస్టు చేశారని మంత్రులు, టీడీపీ నేతలు వెల్లడించారు. మాజీమంత్రి జోగి రమేష్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. భూ అక్రమాలకు పాల్పడ్డ జోగి రమేష్, ఆయన కుటుంబసభ్యుల పాపం పండిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అగ్రిగోల్డ్ భూముల కేసు విచారణలో రాజకీయ జోక్యం లేదని, పూర్తిగా చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు.

AP MINISTERS ON JOGI RAJEEV ARREST
AP MINISTERS ON JOGI RAJEEV ARREST (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 10:48 PM IST

AP MINISTERS ON JOGI RAJEEV ARREST: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌ అరెస్టుపై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. వైఎస్సార్సీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించి, రౌడీయిజం చేసిన వ్యక్తి జోగి రమేష్ ఇవాళ నీతులు మాట్లాడుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసి అడ్డంగా దొరికిన జోగి ఇప్పుడు కులాలు గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన జోగిపై ఫిర్యాదులు వచ్చాకే ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారన్నారు.

జోగి కుమారుడు, ఆయన బాబాయ్ ఇలా అంతా కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అవకాశవాదిలా మాట్లాడుతున్న మాజీ మంత్రి జోగి రమేష్ గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు ఏం మాట్లాడారని ప్రశ్నించారు. కుటుంబ లబ్ధి కోసం చేసిన భూ ఆక్రమణ ఇపుడు రుజువు అవుతుంటే కులం అంటూ మాట్లాడుతున్నారని, టీడీపీ ఎప్పుడూ కులాల గురించి మాట్లాడదన్నారు. అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారని గుర్తించాకే చట్టం తన పని తాను చేసుకొంటోందని, ఇందులో రాజకీయ జోక్యం ఎక్కడుందని నిలదీశారు. ఐదు కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కాజేసే ప్రయత్నం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎక్కడా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు లేవని స్పష్టం చేశారు.

సర్వే నెంబర్‌ మార్చేసి అక్రమాలకు పాల్పడ్డారు : జోగి రాజీవ్ అరెస్టుపై ఏసీబీ ఏఎస్పీ - ACB ASP on Jogi Rajeev Arrest

Minister Kollu Ravindra Comments: భూ అక్రమాలకు పాల్పడ్డ జోగి రమేష్, ఆయన కుటుంబసభ్యుల పాపం పండిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని నీతులు చెప్పిన వైఎస్సార్సీపీ నేతలు, బకాయిలు చెల్లించకపోగా సర్వే నెంబర్లు మార్చేసి భూములు కొట్టేశారని మండిపడ్డారు. ఇది ఆరంభం మాత్రమేనని ఇంక పెద్ద తిమింగళాలను బయటకు లాగుతామన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరని, చట్టప్రకారం శిక్ష పడుతుందన్నారు.

Minister Vasamsetti Subhash: బీసీలకు మేలు చేయని జోగి రమేష్ బీసీ కార్డు వాడుకోవడానికి సిగ్గుపడాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొట్టేసి కొడుకు అరెస్ట్ అయితే నేడు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. మంత్రి పదవి కోసం నాడు చంద్రబాబు ఇంటిపై జోగి అక్రమంగా దాడి చేశాడని ధ్వజమెత్తారు. నేడు చట్టపరంగా అరెస్ట్ చేస్తే బీసీ కార్డు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ తెరవక ముందే వైఎస్సార్సీపీ నేతలు అండర్ గ్రౌండ్​లో దాక్కుంటున్నారని మండిపడ్డారు. బీసీలకు ఒక్క మేలు చేయని జోగి ఇకనైనా బీసీకార్డుపై నోరు మూయాలని హెచ్చరించారు.

Buddha Venkanna: సీఐడీ జప్తు చేసిన ఆస్తులను కొనుగోలు చేసి అవినీతికి పాల్పడిన జోగి రాజీవ్​ను అరెస్టు చేస్తే దానికి బీసీలపై కక్ష సాధిస్తున్నారని జోగి రమేష్ మాట్లాడటం సరికాదని టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. పెడనలో ప్రజలు తిరస్కరిస్తే పెనమలూరు వచ్చిన జోగి రమేష్​ను ప్రజలు ఓడించారన్నారు. వైఎస్సార్సీపీ దారుణాలు చూడలేక వారిని 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు.

జోగి రమేష్ ముందస్తు బెయిల్​ విచారణ- 22కి వాయిదా వేసిన హైకోర్టు - Jogi Ramesh Bail Petition

ABOUT THE AUTHOR

...view details