Ap Liquor Shops Lottery Today :ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల లైసైన్సుల జారీ కోసం నేడు లాటరీ తీయనున్నారు. 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు. జిల్లా గెజిట్‌లో ప్రచురించిన దుకాణాల క్రమసంఖ్య ప్రకారం లాటరీ తీస్తారు. అందులో ఏ దరఖాస్తు సంఖ్య వస్తే సంబంధిత దరఖాస్తుదారుకు లైసెన్సు కేటాయిస్తారు. ఈ ప్రక్రియంతా దరఖాస్తుదారుల సమక్షంలోనే జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40 దుకాణాలను నోటిఫై చేశారు. లాటరీ ప్రక్రియ అల్లూరి జిల్లాలో వేగంగా, తిరుపతి జిల్లాలో ఆలస్యంగా ముగిసే అవకాశముంది.
నేడే లైసెన్సుల జారీ :దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం 3 వేల 396 మద్యం దుకాణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 89 వేల 882 దరఖాస్తులు వచ్చాయి. నాన్ రీఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం సమకూరింది. లక్ష వరకు దరఖాస్తులు వస్తాయని 2 వేల కోట్ల దాకా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. తిరుపతి, శ్రీసత్యసాయి, బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం, పల్నాడు వంటి జిల్లాల్లో దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. ఆయా జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు తమవారిని తప్ప ఇతరులెవరినీ దరఖాస్తులు వేయనివ్వకుండా అడ్డుకోవడం, కొన్ని చోట్ల మద్యం వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదనలున్నాయి. తాడిపత్రి, కమలాపురం వంటి నియోజకవర్గాల్లో ఒక్కో దుకాణానికి 2-3 దరఖాస్తులే వచ్చాయి.
మద్యం దుకాణాల దరఖాస్తుల ఆదాయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
కలెక్టర్ల ఆధ్వర్యంలో లైసెన్సుల జారీ ప్రక్రియ : మొత్తమ్మీద చూస్తే రాష్ట్రంలో సగటున ఒక్కో మద్యం దుకాణానికి 26 దరఖాస్తులు దాఖలయ్యాయి. NTR జిల్లాలో అత్యధికంగా ఒక్కో దుకాణానికి సగటున 51-52 దరఖాస్తులు వచ్చాయి. ఏలూరు జిల్లాలో 38, తూర్పుగోదావరి, గుంటూరులో 35, విజయనగరం జిల్లాలో 34, పశ్చిమగోదావరిలో 32, కర్నూలు, కోనసీమ, అల్లూరి జిల్లాల్లో ఒక్కో దుకాణానికి సగటున 30 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ జిల్లాల్లో పోటీ ఎక్కువగా ఉంది. తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాలో ఈ సగుటు 17గా ఉంది. బాపట్ల జిల్లాలో 18, అన్నమయ్య జిల్లాలో 19, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో 20, నంద్యాల, నెల్లూరు, కాకినాడ, చిత్తూరు జిలాల్లో సగటున 21 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. మిగతా జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లాల్లో తక్కువ దరఖాస్తులు దాఖలయ్యాయి.