AP Inter Exam Results Released: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరంలో 78 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ సౌరబ్‌గౌర్, పరీక్షల కంట్రోలర్ సుబ్బారావు ప్రకటించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించినట్లు వెల్లడించారు. మొదటి సంవత్సర ఫలితాల్లో బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు.
ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత పొందారని చెప్పారు. మొదటి సంవత్సర ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమస్థానం, 81 శాతంతో గుంటూరు జిల్లా ద్వితీయస్థానం, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా తృతీయస్థానం, 48 శాతంతో అల్లూరి జిల్లాకు ఆఖరిస్థానం వచ్చిందన్నారు. రెండో సంవత్సర ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమస్థానం, 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ద్వితీయస్థానం, 84 శాతంతో విశాఖ జిల్లాకు తృతీయస్థానం, 63 శాతంతో చిత్తూరు జిల్లాకు ఆఖరిస్థానంలో ఉందన్నారు.
ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు రీవాల్యుయేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫెయిల్ అయినా, మరింతగా మెరుగైన మార్కులు సాధించాలనుకునే విద్యార్థుల కోసం సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రాక్టికల్ పరీక్షల సప్లిమెంటరీ మే 1వ తేదీ నుంచి 4 వరకు నిర్వహిస్తామన్నారు.
పరీక్షల కోసం ఫీజులను ఈనెల 18 నుంచి 24లోగా సంబంధిత కళాశాల వద్ద చెల్లించాలని తెలిపారు. పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ఫలితాల వల్ల భవిష్యత్తు ప్రభావితం కాదని సౌరబ్‌గౌర్ అన్నారు. ఫలితాలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లలకు మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.