AP High Court on Married Daughter Compassionate Appointment :వివాహమైన కుమార్తె ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో ఎప్పటికీ భాగమేనని హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లైనంత మాత్రాన తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాకుండా పోదని తేల్చిచెప్పింది. తల్లిదండ్రుల బాగోగులను చూసుకునే బాధ్యతను వివాహమైన కుమార్తెల నుంచి దూరం చేయడానికి, తీసేయడానికి వీల్లేదంది. కారుణ్య నియామక వ్యవహారంలో వివాహమైన కుమారుడి విషయంలో లేని అనర్హత, వివాహమైన కుమార్తె విషయంలో చూపడం వివక్షతో కూడుకుందని పేర్కొంది.
పెళ్లయిందన్న కారణంతో కుమార్తెను ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనడం దుర్మార్గమని వెల్లడించింది. పిటిషనర్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం నిరాకరించడం తగదని పేర్కొంది. సిరిపల్లి అమ్ములు అనే మహిళకు స్వీపర్‌గా లేదా తగిన ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మథరావు ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చారు.
విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో స్వీపర్‌గా పని చేస్తూ వి. జగదీష్ అనే వ్యక్తి 2013 జూన్ 24న కన్నుమూశారు. ఆయనకు మోహన, సిరిపల్లి అమ్ములు అనే ఇద్దరు కుమార్తెలున్నారు. తండ్రి నిర్వహించిన స్వీపర్ పోస్టును కారుణ్య నియామకం కింద తనకు ఇవ్వాలని రెండో కుమార్తె సిరిపల్లి అమ్ములు దేవస్థానం అప్పటి ఈవోకి వినతి సమర్పించారు. కోర్టు నుంచి విడాకుల పత్రాన్ని తీసుకురావాలని ఈవో సూచించారు. తన భర్త ఎక్కడున్నారో తెలియడం లేదని, తండ్రి స్వీపర్ పోస్టును తనకు ఇవ్వాలని మరోసారి ఈవోను ఆమె విజ్ఞప్తి చేశారు. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌కు సైతం వినతి సమర్పించారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో 2021లో హైకోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వ ఉద్యోగి అదృశ్యమైతే.. ఏడేళ్ల తర్వాతే కారుణ్య నియామకమా?
తండ్రి కన్నుమూసేనాటికి ఆయనపై ఆధారపడి జీవిస్తున్నాను అనేందుకు గల ఆధారాలను పిటిషనర్ సమర్పించలేదని దేవాదాయ కమిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆమెకు వివాహం అయ్యిందని, అప్పటి నుంచి భర్తతో నివసిస్తుందన్నారు. తండ్రితో కలిసి ఆమె జీవించడం లేదన్నారు. తాను విడాకులు తీసుకున్న మహిళనని, భర్తపై ఆధారపడి జీవించడం లేదని చెబుతున్నారే కానీ విడాకుల పత్రాన్ని చూపడం లేదన్నారు. విడాకుల పత్రాన్ని ఆధారంగా చూపని కారణంగా పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరిస్తూ 2018లో ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
పిటిషనర్, ఆమె సోదరికి వారి తండ్రి బతికుండగానే వివాహం అయ్యిందన్నారు. తన భర్త 2020 డిసెంబర్లో కన్నుమూశారని పిటిషనర్ ధ్రువపత్రం సమర్పించారన్నారు. దీనిని బట్టి చూస్తే తండ్రి జగదీష్ 2013లో మరణించేనాటికి అతనిపై ఆధారపడి పిటిషనర్ జీవించడం లేదని స్పష్టమవుతోందన్నారు. 1999లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 350 ప్రకారం వివాహిత కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలేనని పిటిషనర్ తరఫు న్యాయవాది డీవీ శశిధర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ భర్త సైతం మరణించారన్నారు. పిటిషనర్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
హైకోర్టు తీర్పు : ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వం జారీ చేసిన జీవో, సర్క్యులర్లను పరిశీలిస్తే వివిధ షరతులకు లోబడి వివాహిత కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలని స్పష్టం చేస్తున్నాయన్నారు. మృతి చెందిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత కల్పించడం, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడమే కారుణ్య నియామక పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ పథకం అమలులో వివాహం చేసుకున్న కుమార్తెల విషయంలో వివక్ష చూపేలా షరతులు విధించడం చట్టవిరుద్ధమన్నారు. అర్హత నిబంధనలను పరిశీలిస్తే 'కుమారుడి'కి వివాహం అయ్యిందా? కాలేదా? అనే విషయంలో ఎలాంటి షరతులు లేవని గుర్తు చేశారు.
కుమార్తె విషయంలో మాత్రం 'అవివాహిత కుమార్తె' మాత్రమే అర్హురాలని పేర్కొన్నారన్నారు. పెళ్లయిందన్న కారణంతో వివాహిత కుమార్తెను అనర్హురాలిగా ప్రకటిస్తున్నారు. వివాహమైన కుమారుడి విషయంలో లేని అనర్హత, వివాహమైన కుమార్తె విషయంలో చూపడం వివక్షే. పెళ్లికాని, కాకపోని కుమార్తె, కుమారులు జీవితాంతం వారు తల్లిదండ్రుల కుటుంబంలో భాగం అవుతారు. పెళ్లయిందన్న కారణంతో కుమార్తె ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనడం దుర్మార్గం అని తీర్పులో పేర్కొన్నారు. పెళ్లైనంత మాత్రాన తల్లిదండ్రుల కుటుంబంలో కుమార్తె సభ్యురాలు కాకుండా పోదన్నారు. కుమార్తెలకు వివాహం అయిన తర్వాత తల్లిదండ్రుల బాగోగులను చూసుకునే బాధ్యతను దూరం చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
తల్లిదండ్రుల అవసరాలను తీర్చే బాధ్యత వివాహమైన కుమార్తెపైనా ఉంటుందన్నారు. తల్లిదండ్రుల వ్యవహారమై బాధ్యతలను నెరవేర్చే క్రమంలో కుమార్తె, కుమారులకు పెళ్లిళ్లు అయ్యాయా, కాలేదా? అనే విషయంలో వ్యత్యాసం లేదని తెలిపారు. యాక్ట్ 56/2007 చట్ట నిబంధనలను ఇదే విషయాన్ని చెబుతున్నాయని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని అమ్ములుకు స్వీపర్‌గా లేదా తగిన పోస్టులో ఎనిమిది వారాల్లో నియమించాలని అధికారులను ఆదేశించారు. పిటిషనర్ తండ్రి చనిపోయిన తేది నుంచి సర్వీసు ప్రయోజనాలు కల్పించాలన్నారు. నోవర్క్-నోపే సూత్రం నేపథ్యంలో ఆర్థిక ప్రయోజనం పొందేందుకు మాత్రం పిటిషనర్ అనర్హులని స్పష్టత ఇచ్చారు.
'కారుణ్య నియామకాలలో ప్రభుత్వం తీరు సరిగా లేదు'