ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో గూగుల్‌ పెట్టుబడులు - ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం

గూగుల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం - రాష్ట్రంలో పెద్దఎత్తున ఐటీని అభివృద్ధి చేస్తామని గూగుల్ ప్రకటన

AP_GOVT_MOU_WITH_GOOGLE
AP GOVT MOU WITH GOOGLE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

AP GOVT MOU WITH GOOGLE: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒప్పందం చేసుకున్నారు. విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు గూగుల్ ఒప్పందం ఉండనుంది. రాష్ట్రంలో పెద్దఎత్తున ఐటీ అభివృద్ధి చేస్తామని గూగుల్ ప్రకటించింది.

గూగుల్‌ గ్లోబల్‌ నెట్‌వర్కింగ్‌ అండ్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ ఉపాధ్యక్షుడు బికాశ్‌ కోలే నేతృత్వంలో ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్​లతో అమరావతిలో సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా గూగుల్‌ కార్యకలాపాలు, భవిష్యత్‌ ప్రణాళికలతో పాటు విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడుల ప్రణాళికలను ప్రతినిధుల బృందం వివరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్​ సమక్షంలో అధికారులు, గూగుల్‌ ప్రతినిధులు మధ్య ఒప్పందంపై సంతకాలు చేశారు.

గూగుల్ ప్రతిపాదిత పెట్టుబడులను స్వాగతిస్తున్నాం:ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముందస్తు ఆలోచన కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో గూగుల్‌ సంస్థ పెట్టుబడుల ప్రతిపాదనను ఆయన స్వాగతించారు. పాలసీ నిబంధనల మేరకు వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఎకో సిస్టం కల్పించడం సాధ్యం అవుతుందని ఆకాంక్షించారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న సీఎం, ఒప్పందం వల్ల నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సంస్థ అంతర్జాతీయ, స్థానిక బృందాలు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తాయని వివరించారు.

దిగ్గజ సంస్థతో భాగస్వామ్యం ఏపీని శక్తిమంతంగా చేస్తుంది:నూతన ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాయని సీఎం స్పష్టం చేశారు. అవి పెట్టుబడిదారులను ఆకర్షించాయని, ఉపాధి అవకాశాలకు మార్గాన్ని సుగమం చేశాయన్నారు. గూగుల్ సంస్థ కీలక భాగస్వామిగా రాష్ట్రాన్ని గుర్తించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ అంశాల్లో సాంకేతిక సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సీఎం తెలిపారు.

సాంకేతిక రంగంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దిగ్గజ సంస్థ గూగుల్‌తో భాగస్వామ్యం మన రాష్ట్రాన్ని శక్తిమంతంగా చేస్తుందని ఆకాంక్షించారు. అంతిమంగా దేశ డిజిటల్‌ వృద్ధికి దోహదం చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి కలిసి పని చేయాలన్నది తన ఆకాంక్షగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్‌ సంస్థ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం అందుకు దోహదం చేస్తుందని చంద్రబాబు ఎక్స్​లో పోస్ట్ చేశారు.

అమెరికాలో చర్చలు ఫలవంతం:తన అమెరికా పర్యటనలో గూగుల్‌ ఉన్నతస్థాయి ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయని మంత్రి నారా లోకేశ్​ వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందన్నారు. కొద్ది నెలలకే ఆర్సెలార్‌ మిత్తల్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, భారత్‌ ఫోర్జ్‌ వంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వంతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు ప్రతినిధి బృందం వచ్చిందన్నారు. గూగుల్‌కు ఏపీ కీలక భాగస్వామ్య రాష్ట్రమని, భవిష్యత్తులో కొత్త కార్యకలాపాలను చేపట్టే అవకాశం ఉందని గూగుల్‌ గ్లోబల్‌ నెట్‌వర్కింగ్‌ అండ్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ ఉపాధ్యక్షుడు బికాశ్‌ కోలే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏపీకి గూగుల్​ - ప్రభుత్వంతో కీలక ఒప్పందం

రాష్ట్రంలో రిలయన్స్​ రూ.65 వేల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ

ABOUT THE AUTHOR

...view details