Aasara Pension through banks:ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెన్షన్ ల కోసం లబ్దిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. మే 1 తేదీన లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ జమ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలు లేని దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటివద్దే పంపిణీకి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది. మే1 తేదీ నుంచి 5 తేదీలోపు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచనలు చేసింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాలు దృష్ట్యా 2024 మే, జూన్ మాసాలకు చెందిన పెన్షన్లను రెండు విధాలుగా లబ్దిదారులకు అందించనున్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. పెన్షన్ లబ్దిదారుల్లో 74 శాతం మందికి బ్యాంకు ఖాతాలకు పెన్షన్ జమ చేస్తామని మిగతా 26 శాతం మందికి ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. 2024 మే, జూన్ మాసాలకు గానూ ఆధార్ కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకు పెన్షన్ జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం 65,49,864 మంది పెన్షన్ లబ్దిదారుల్లో 74 శాతం మందికి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ వ్యవస్థ ఉన్నట్టుగా నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ వెల్లడించిందని స్పష్టం చేసింది. 48 లక్షల మంది పెన్షన్ లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ మ్యాపింగ్ అయి ఉందని ప్రభుత్వం తెలిపింది.