High Court Bench in Kurnool : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలియజేసేందుకు కాంపిటెంట్ అథారిటీ ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని న్యాయశాఖ కార్యదర్శిని కోరారు. ఈ మేరకు గతనెల 28న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు. భాషా ప్రాతిపదికన మొదట ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది. ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. దీనిపై ఇటీవల సమీక్ష నిర్వహించి బెంచ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం తప్పనిసరి. రాయలసీమలో అంతకుముందు చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. 2022లో జిల్లాల పునర్విభజన తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని 8 జిల్లాలుగా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.95 కోట్ల జనాభాలో రాయలసీమలోని 8 జిల్లాలో 1.59 కోట్ల మంది ఉన్నారు. ఇది ఏపీ జనాభాలో 25 శాతం కంటే ఎక్కువ.
Kurnool High Court Bench :రాష్ట్ర విస్తీర్ణంలో రాయలసీమ 8 జిల్లాల విస్తీర్ణం 43 శాతం ఉంది. కర్నూలు నుంచి విజయవాడకు నేరుగా ఒక్క రైలు లేదు. కడప నుంచి విజయవాడకు ఒక్క రైలు మాత్రమే ఉంది. ఫలితంగా ఈ ప్రాంతం నుంచి హైకోర్టుకు ప్రయాణం చేయాలంటే సాధారణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను హైకోర్టు న్యాయమూర్తుల ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జనరల్‌ను న్యాయశాఖ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.