Jal Jeevan Mission in AP : పథకం:జలజీవన్ మిషన్
ఉద్దేశం: కుళాయి కనెక్షన్ల ద్వారా ఇంటింటికీ రక్షిత నీటి సరఫరా
గత ప్రభుత్వంలో ఏం చేశారు? : గ్రామాల్లో 70.04 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. అందుకు చేసిన వ్యయం: రూ.4,128 కోట్లు
ఏం జరిగింది?: సగానికిపైగా కనెక్షన్ల నుంచి నీళ్లే రావడం లేదు. అత్యధిక చోట్ల కుళాయిలు అలంకారప్రాయంగా మిగిలాయి
కారణం? :వైఎస్సార్సీపీ సర్కార్రివర్స్ పాలనలో తగిన జలవనరుల లభ్యత లేకపోయినా, గ్రామాల్లో పెద్దఎత్తున కుళాయి కనెక్షన్లు ఇచ్చేశారు. ఆ తర్వాత చేతులెత్తేశారు.
జలజీవన్ మిషన్ పనుల్లో కూటమి ప్రభుత్వం సమూల మార్పులు చేస్తోంది. గ్రామాల్లోని గృహాలకు ఇచ్చిన కుళాయి కనెక్షన్ల ద్వారా 365 రోజులూ తాగునీరు సరఫరా అయ్యేలా ప్రణాళికలు చేపడుతోంది. సమీప జలాశయాలు, నదుల నుంచి పైపులైన్ల ద్వారా నీటిని తరలించి, వేసవిలోనూ ప్రజలకు సరఫరా చేసేలా డిజైన్లను మార్చనున్నారు. బోర్లు తవ్వి, వాటి నుంచి నీటిని సరఫరా చేయాలని గత వైఎస్సార్సీపీ సర్కార్ ప్రతిపాదించిన వాటిలో దాదాపు 40,000ల పనులను రద్దు చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలపై గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు రూ.60,000ల కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేశారు. సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.30,000ల కోట్ల మేర అదనంగా పెరుగుతుంది. అయినా సర్కార్ సుముఖంగా ఉంది. రాష్ట్రస్థాయి అంచనాల కమిటీ ఆమోదంతో వాటిని త్వరలో కేంద్రానికి పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జలజీవన్ మిషన్‌కు వైఎస్సార్సీపీ సర్కార్ రాష్ట్ర వాటా నిధులను సరిగా ఇవ్వకుండా భ్రష్టు పట్టించింది. గత ఐదు సంవత్సరాల్లో చేపట్టిన పనుల్లో ప్రణాళిక కొరవడటంతో ఎందుకూ కొరగాకుండా పోయాయి. అత్యధిక జిల్లాల్లో నీటి లభ్యత లేక కుళాయి కనెక్షన్లు ఇండ్ల ముందు అలంకారప్రాయంగా మారాయి.
బోర్లతో నీళ్లంటే వేసవిలో అల్లాడిపోవలసిందే :ఏటా ఎండాకాలం ప్రారంభం నుంచే భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో బోర్లలో నీటి లభ్యత తగ్గుతోంది. వేసవి నాలుగు నెలలూ దాదాపు ఇదే పరిస్థితి. బోర్లపై ఆధారపడే తాగునీటి పథకాల ద్వారా వేసవిలో నీరు అందించేందుకు వీల్లేక అత్యధిక జిల్లాల్లో ట్యాంకర్లతో సరఫరా చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ వైఎస్సార్సీపీ సర్కార్ జలజీవన్ మిషన్‌లో బోర్ల ద్వారా కుళాయిలకు నీరు సరఫరా చేసేలా రూ.27,248 కోట్లతో పనులను ప్రతిపాదించింది. 77,917 పనుల్లో గత ఐదేళ్లలో 23,871 పూర్తయ్యాయి. ఇందులో కొత్తగా తవ్విన బోర్లు కూడా ఉన్నాయి. వీటిలో చాలా బోర్లు గత రెండు సంవత్సరాల్లో వేసవిలో అడుగంటాయి. దీంతో ప్రజలు తాగునీటికి అల్లాడారు.
ఖర్చు ఎక్కువైనా :జలాశయాలు, నదుల నుంచి నీటిని పైపులైన్లు, కాలువల ద్వారా సేకరించి సరఫరా చేయడం ద్వారా గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. గ్రామాల్లో ఇప్పటికే 70.04 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. దీంతో పాటు అదనంగా మరో 25.40 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు ఖర్చు ఎక్కువైనా గ్రామాలకు సమీపంలోని జలాశయాల నుంచి సంవత్సరం పొడవునా నీరు ఇచ్చేలా పనులు చేపట్టాలని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాన్ని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఈ దిశగా ప్రకాశం బ్యారేజీ, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గండికోట, పెన్నా అహోబిలం, తోటపల్లి, గోదావరి, వంశధార నదులు, జలాశయాల నుంచి గ్రామాలకు నీటి సరఫరా కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించారు. పైపులైన్ల ద్వారా తెచ్చే నీటిని శుద్ధి చేశాక గ్రామాల్లోని ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సంపులకు అనుసంధానించి ప్రజలకు కుళాయిల ద్వారా సరఫరా చేస్తారు. దీనివల్ల అంచనా వ్యయం గతంలో కంటే మరో రూ.30,000ల కోట్లు అదనం. దీనిపై కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
వైఎస్సార్సీపీ హయాంలో జలజీవన్ మిషన్ అస్తవ్యస్తం - కుళాయి ఉన్న చుక్క నీరందని పరిస్థితి - Jal Jeevan Mission failed at YCP
'జల్‌జీవన్'కు జవసత్వాలు- రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు - World Bank on Irrigation Projects