AP Government MOU With Infosys On Skill Development : రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే స్కిల్ సెన్సస్ ప్రి-వాలిడేషన్ కోసం ఇన్ఫోసిస్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా జనరేటివ్ AIని ఉపయోగిస్తారు. అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధ్రువీకరణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందించేందుకు ఇన్ఫోసిస్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి లోకేశ్ సమక్షంలో ఇన్ఫోసిస్‌తో ఒప్పందం చేసుకున్నారు.
అనంతరం లోకేశ్ మాట్లాడుతూ, ఇన్ఫోసిస్ చొరవ అభినందనీయమని ప్రశంసించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సస్ డాటా ప్రివాలిడేషన్ కు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. దీనిద్వారా రాష్ట్రంలోని యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి, మార్కెట్ డిమాండ్ కు తగ్గట్టుగా వారికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడానికి మార్గం సులభతరం అవుతుందని తెలిపారు.
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ - రెండు సంస్థలతో ప్రభుత్వం ఎంవోయూ
20లక్షల ఉద్యోగాలు : రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాల లక్ష్యసాధనలో భాగస్వామి కావడానికి ఇన్ఫోసిస్ ముందుకు వచ్చిందని లోకేశ్ వెల్లడించారు. డిజిటల్ లెర్నింగ్‌లో భాగంగా ఇన్ఫోసిస్ సంస్థ లెర్నింగ్ పాత్‌వేస్‌కు విద్యార్థులను కనెక్ట్ చేసే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌లను సృష్టించి, నిరంతర అభ్యాసాన్ని సులభతరం చేస్తుందన్నారు. పరిశ్రమ అవసరాలను తీర్చడానికి ఏపీఎస్ఎస్డీసీ (APSSDC)కి సహకరిస్తుందని తెలిపారు. ఔత్సాహికులకు ఉచితంగా నేర్చుకునే అవకాశాలను కల్పించడం, సాంకేతికత అభివృద్ధి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్ నిర్వహణ ఇన్ఫోసిస్ చేపడుతుందని లోకేశ్ స్పష్టం చేశారు.
అలాగే అభ్యర్థుల నైపుణ్యాలను సమర్థవంతంగా అంచనా వేయడానికి ఇన్ఫోసిస్ జనరేటివ్ డిజిటల్ ప్లాట్ ఫారంను అభివృద్ధి చేసి అందిస్తుందని లోకేశ్ వివరించారు. ఈ ప్లాట్‌ఫారమ్ వివిధ పరిశ్రమలలో అవసరమైన నైపుణ్యాల సమగ్ర మూల్యాంకన చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా అభ్యర్థుల ప్రస్తుత నైపుణ్య స్థాయిలను అంచనా వేసి ముందస్తు ధ్రువీకరణకు చర్యలు చేపడతారన్నారు. ప్రాథమిక అంచనాలను బట్టి అభ్యర్థుల ప్రస్తుత నైపుణ్యాలు, తదుపరి అభివృద్ధి కోసం సిఫార్సులు చేస్తారని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.