IPS PV Sunil Kumar Issue in AP : సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌ను విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రఘురామకృష్ణరాజు కేసులో ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్ట్ పెట్టారు. ఈ వ్యవహారంపై ఆయణ్ని విచారించాలని నిర్ణయించిన సర్కార్ విచారణాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోదియాను నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ హరీశ్‌గుప్తా ఈ కేసును విచారణాధికారి ముందు ప్రజంట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
రాజద్రోహం కేసులో అరెస్టైన తనను పోలీసు కస్టడీలో హతమార్చేందుకు యత్నించారంటూ శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గుంటూరు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర సెక్షన్ల కింద సునీల్‌కుమార్‌పై కేసు నమోదైంది. ఈ కేసు నమోదు నిర్ణయాన్ని తప్పుపడుతూ జులై 12న సునీల్‌కుమార్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఇది అఖిల భారత సర్వీసు ప్రవర్తనా నియమావళిలోని 7వ నియమ ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రభుత్వం తేల్చింది. ఆయనపై అభియోగాలు నమోదు చేస్తూ 2024 అక్టోబర్ 7న ఉత్తర్వులిచ్చింది. ఇప్పుడు ఆయణ్ని విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.
అగ్రిగోల్డ్ ప్యాకేజీ దుర్వినియోగం : అగ్రిగోల్డ్ బాధితులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మొత్తాన్ని అప్పటి సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్ దుర్వినియోగం చేశారంటూ రఘురామకృష్ణరాజు శుక్రవారం ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. 2021 ఆగస్టులో అప్పటి సర్కార్ అగ్రిగోల్డ్ బాధితులకు ప్యాకేజీ ప్రకటించి, వారి ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఆ నిధులను సునీల్‌కుమార్, ఆయన సహచరుడు కామేపల్లి తులసిబాబుతో కలిసి దుర్వినియోగం చేశారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాపట్ల జిల్లా జె.పంగలూరు మండలం రామకూరులోని 96 మంది నకిలీ అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాలకు ప్యాకేజీ సొమ్ము జమ చేసి వారి నుంచి రూ.15,000లు, రూ.20,000ల చొప్పున సునీల్‌కుమార్, తులసిబాబు వసూలు చేశారని రఘురామ పేర్కొన్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో 400 మంది వద్ద కూడా ఇలాగే తీసుకున్నారని తెలిపారు. తెలంగాణలోని షాద్‌నగర్‌లో అగ్రిగోల్డ్ భూములు కొన్నవారిని బెదిరించి డబ్బు దండుకున్నారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో వివరించారు.