ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు రాని ప్రభుత్వం, పార్టీ కార్యాలయాలకు మాత్రం!

YSRCP Party Offices: శరవేగంగా వైఎస్సార్​సీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలు సాగుతున్నాయి. 26 జిల్లాల్లో చాలా వరకూ ఈ భవనాల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. అయితే కోట్ల రూపాయలు పలికే స్థలాలను పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం వైఎస్సార్​సీపీ ప్రభుత్వం కారుచౌకగా ధారాదత్తం చేసేసింది. కేవలం ఎకరానికి వెయ్యి చొప్పున 33 ఏళ్లు లీజుకు అప్పగించింది.

ysrcp_party_offices
ysrcp_party_offices

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 9:27 AM IST

శరవేగంగా వైసీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణం

YSRCP Party Offices:26 జిల్లాలు! ప్రతీచోటా కొనాలంటే కోట్లు పలికే స్థలాలు. కానీ, ఎకరాకు వెయ్యి రూపాయలు చెల్లిస్తే చాలు 33 ఏళ్లపాటు లీజుకిస్తారు. అలాగైతే మాకూ ఓ ఎకరం కావాలంటారా. అది అందరికీ వర్తించే ఆఫర్‌ కాదు. ఎందుకంటే అవి జగనన్న చేత, జగగన్న పార్టీకి కట్టబెట్టిన స్థలాలు. జగన్‌ ప్రభుత్వమే ఖరారు చేసిన ధరలు. స్థానిక సంస్థల అభ్యంతరాల్ని తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్​సీపీ కార్యాలయాలకు విలువైన స్థలాలు ధారాదత్తం చేసింది. ప్రజావసరాలను పణంగా పెట్టి ప్రతీ జిల్లా కేంద్రంలో ఖరీదైన భూముల్ని అప్పనంగా అప్పగించింది. జిల్లా కలెక్టరేట్లు, విశాఖ రైల్వేజోన్‌ కార్యాలయాలకు భూములు కేటాయించడానికి చేతులురాని జగన్‌, సొంత పార్టీ కార్యాలయాలకు మాత్రం సమర్పించేసుకున్నారు.

ఎండాడ ప్రాంతంలోని పనోరమ హిల్స్‌కు సమీపంలో జగన్‌ సర్కార్‌ వైఎస్సార్​సీపీ కార్యాలయానికి రెండెకరాలు కేటాయించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇక్కడ గజం 40వేల రూపాయలు. బహిరంగ మార్కెట్లో దీని విలువ 44 కోట్లు పైమాటే. కానీ ప్రభుత్వానికి వైఎస్సార్​సీపీ చెల్లించాల్సిన డబ్బెంతో తెలుసా. కేవలం 66 వేల రూపాయలే. అదీ ఏడాదికో రెండేళ్లకో కాదు. 66వేలు చెల్లించి 33 ఏళ్ల లీజు అనుభవించబోతోంది.

ఇక అనకాపల్లి జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయం కోసం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొత్తూరు నర్సింగరావుపేటలో ఎకరం 75 సెంట్ల స్థలం అప్పగించారు. తెలుగుదేశం హయాంలో అక్కడ 5 కోట్ల రూపాయలతో కాపు భవన్‌ నిర్మించాలని ప్రతిపాదించింది. ఇప్పుడు అక్కడ వైఎస్సార్​సీపీ కార్యాలయం కట్టేసుకుంటున్నారు.

వైసీపీలో వర్గపోరు - మంగళగిరిలో పోటాపోటీగా పార్టీ కార్యాలయాలు ప్రారంభం

అల్లూరి సీతారామరాజు జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయానికి పాడేరు సమీపంలోని చింతలవీధిలో రెండెకరాలు కేటాయించారు. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ 4కోట్లుగా ఉంది. కానీ వైఎస్సార్​సీపీ దీనికి 33 ఏళ‌్లకు కలిపి 66 వేలు లీజు చెల్లించనుంది. నిజానికి ఈ స్థలంలో స్థానిక గిరిజనులు కొందరు ఉద్యాన పంటలు సాగు చేసుకునేవారు. తమకు డి.పట్టా మంజూరు చేయాలని వారంతా కోరుతున్నా పాలకులు పట్టించుకోలేదు. ఈ అంశంపై గిరిజనులూ ఆందోళనలూ చేపట్టారు. ప్రస్తుతం వివాదం కోర్టులో ఉండటంతో పనులు ప్రారంభం కాలేదు.

విజయనగరం జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయం నిర్మితమవుతోంది. నగరపాలిక పరిధిలోని మహారాజుపేట సౌత్‌ వార్డులో ఎకరా ప్రభుత్వ భూమిని దీనికి కేటాయించారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ 12 కోట్లపైమాటే. కానీ 33వేల రూపాయలకు 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఈ స్థలాన్ని సమర్పించుకున్నారు. వాస్తవానికి ఇదే స్థలంలో ప్రజలకు ఉపయోగపడే శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రి, విద్యుత్‌ పంపిణీ ఉప కేంద్రం నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. వాటితో ప్రజలకు ఉపయోగంగానీ వైఎస్సార్​సీపీకి ప్రయోజనం లేదు కదా. అందుకే పాత ప్రతిపాదనలకు పాతరేసి కొత్తగా వైఎస్సార్​సీపీ కార్యాలయానికి పునాదులు వేశారు.

శ్రీకాకుళం వైఎస్సార్​సీపీ కార్యాలయానికి ఎకరన్నర స్థలాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. బహిరంగ మార్కెట్‌లో నాలుగున్నర కోట్లు పలుకుతుంటే, వైఎస్సార్​సీపీ దానికి 33 ఏళ్లకు కలిపి 49 వేల 500 రూపాయల నామ మాత్రపు లీజు చెల్లించనుంది. తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయానికి ప్రభుత్వం 2 ఎకరాలు సమర్పించుకుంది.బహిరంగ మార్కెట్‌ ప్రకారం వీటి విలువ 48 కోట్ల 75లక్షలు. కానీ వైఎస్సార్​సీపీ 66వేల రూపాయల నామమాత్రపు ధరతో దీన్ని 33 ఏళ్ల లీజుకు దక్కించుకుంది.

బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో భవిష్యత్తులో కలిసి ముందుకెళ్తాం: బీవీ రాఘవులు

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయం కోసం అమలాపురంలోని రావుల చెరువు వద్ద ఎకరం కేటాయించారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం బహిరంగ మార్కెట్‌లో పదికోట్లు పలుకుతోంది. కానీ దీన్ని 33 ఏళ్లకు కలిసి 66 వేల రూపాయలకు అప్పగించారు. ఐతే సదరు భూమిని వైఎస్సార్​సీపీ కార్యాలయానికి ఇవ్వద్దని స్థానిక పంచాయతీ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఎందుకు రద్దు చేయకూడదో సంజాయిషీ ఇవ్వాలంటూ జిల్లా పంచాయతీ అధికారి 2022 డిసెంబర్‌ 9న పంచాయతీ సభ్యులకు నోటీసులిచ్చారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది.

కాకినాడ వైఎస్సార్​సీపీ కార్యాలయానికి ప్రభుత్వ కార్యాలయాల పక్కనే 2ఎకరాల స్థలం ఇచ్చారు. దీని మార్కెట్‌ విలువ కోటి 60లక్షల వరకూ పలుకుతోంది. కానీ, 33 ఏళ్లకు 66వేల రూపాయల లీజు చెల్లించేలా వైఎస్సార్​సీపీకి రాసిచ్చేశారు. దీనిపై స్థానిక అధికారపార్టీ నేతలకు ఎంత ప్రేమంటే ఈ భూమిని నిషిద్ధ జాబితా నుంచి తొలగించి బ్యాంకు నుంచి రుణం వచ్చేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయం కోసం ఉండి మండలం ఎన్​ఆర్​పీ అగ్రహారంలో ప్రభుత్వం 72 సెంట్లు కేటాయించింది. బహిరంగ మార్కెట్‌లో 3కోట్లు పలుకుతున్న ఈ భూమిని వైఎస్సార్​సీపీ సర్కార్‌ 33 ఏళ్లకు కలిపి 23 వేల 720 రూపాయలకు దక్కించుకుంటోంది. ఇక్కడా వైఎస్సార్​సీపీ కార్యాలయానికి వ్యతిరేకంగా పంచాయతీ సభ్యులు తీర్మానం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

చర్చి గదుల్లో పార్టీ కార్యాలయాలు వద్దు

ఏలూరు జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయం కూడా తుదిదశకు చేరింది. ఏలూరు నడిబొడ్డునున్న అల్లూరి సీతారామరాజు స్టేడియం, గిరిజన యువత శిక్షణ కేంద్రం మధ్యలోని విలువైన 2 ఎకరాలు దీనికి కేటాయించారు. బహిరంగ మార్కెట్‌లో 48 కోట్ల 75 లక్షల వరకూ పలుకుతున్న ఈ స్థలాన్ని వైఎస్సార్​సీపీకి 66 వేల రూపాయలు 33 ఏళ్లకు కలిపి చెల్లించేలా కట్టబెట్టారు.

ఎన్టీఆర్​ జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయం కోసం విజయవాడ సితార జంక్షన్‌లో ఎకరం పది సెంట్లు అప్పగించారు. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ 55 కోట్ల రూపాయలు. దీనికి 33 ఏళ్లపాటు చెల్లించే లీజు కేవలం 36 వేల 300 రూపాయలే. అసలు ఇక్కడ ప్రజలు ఆహ్లాదంగా గడపడానికి పార్కు రావాల్సింది. స్థానిక కీలక ప్రజాప్రతినిధి జోక్యంతో ఆ ప్రతిపాదన అటకెక్కి పార్క్‌ స్థానంలో వైఎస్సార్​సీపీ భవనం రూపుదిద్దుకుంటోంది.

కృష్ణా జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయం కోసం ప్రభుత్వం మచిలీపట్నంలో రెండెకరాలు కేటాయించింది. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ 70 కోట్ల రూపాయలు. కారుచౌకగా పార్టీ ఖాతాలో వేసుకున్న ఈ భూమికి 33 ఏళ్లలో వైఎస్సార్​సీపీ చెల్లించేది అక్షరాలా 66 వేల రూపాయలు మాత్రమే.

'సొంత నిధులతో పార్టీ కార్యాలయాలు నిర్మిస్తా'

ఇక గుంటూరు జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయం కోసం తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్‌ బోటియార్డులో రెండెకరాలు కేటాయించారు. బహిరంగ మార్కెట్‌లో 16 కోట్లు పలుకుతున్న ఈ భూమికి వైఎస్సార్​సీపీ 33 ఏళ్లకు కలిపి చెల్లించబోయేది 66వేల రూపాయలు మాత్రమే. వాస్తవానికి ఈ భూమిని తాడేపల్లి మున్సిపాలిటీ నీటి అవసరాల కోసం ఫిల్టర్‌ బెడ్ల నిర్మాణానికి కోరగా అప్పట్లో జలవనరులశాఖ అభ్యంతరం తెలిపింది. దాన్నే నిరుపయోగ భూమిగా కన్వర్షన్‌ చేసి మరీ అధికారులు వైఎస్సార్​సీపీకి హారతిపల్లెంలో పెట్టి అప్పగించారు. ప్రస్తుతం ఈ స్థలంలో ఉన్న చెట్లు నరికి శుభ్రం చేశారు.

పల్నాడు జిల్లా నరసరావుపేట వైఎస్సార్​సీపీ కార్యాలయం ఇంద్రభవనంలా నిర్మిస్తున్నారు. దాని కోసం ప్రభుత్వం ఎకరంన్నర స్థలం కేటాయించింది. పల్నాడు కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు ఎదురుగానే స్థలం ఇచ్చారు. ఇక్కడ గజం లక్ష రూపాయల వరకూ పలుకుతోంది. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ 15 కోట్లరూపాయల వరకూ ఉంటుంది. కానీ 33 ఏళ్లకు చెల్లించాల్సిన లీజు ధర 49 వేల 500 రూపాయలు. ఈ స్థలం ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైనా పట్టించుకోలేదు.

ఎన్నిక ముగిసింది.. సందడి తగ్గింది

బాపట్ల వైఎస్సార్​సీపీ జిల్లా కార్యాలయానికి ఆర్టీసీ డిపో వెనకే 2 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. బహిరంగ మార్కెట్‌ 12 కోట్లు పలుకుతున్న ఈ భూమికి వైఎస్సార్​సీపీ 33 ఏళ్లకు చెల్లించేది 66వేల రూపాయలే. నిజానికి జిల్లా కేంద్రమైన బాపట్లలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జూనియర్‌ కళాశాలకు శాశ్వత భవనాలు లేవు. తొమ్మిదేళ్లుగా తాత్కాలిక భవనాల్లోనే అరకొర వసతులతో నెట్టుకొస్తున్నారు. విద్యార్థుల అవసరాలు పట్టని ప్రభుత్వం, అధికార పార్టీ కోసం ఆగమేఘాలపై భూమి అప్పగించింది.

ప్రకాశం జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయం ఒంగోలులో శరవేగంగా సిద్ధమవుతోంది. పాత నెల్లూరు - గుంటూరు రహదారికి, జలవనరులశాఖ కార్యాలయానికి మధ్యలో ఎకరా 64 సెంట్లను ప్రభుత్వం కేటాయించింది. బహిరంగ మార్కెట్లో దీని విలువ 9కోట్ల 84 లక్షల వరకూ ఉంటుంది. కానీ 33ఏళ్లకు వైఎస్సార్​సీపీ చెల్లించబోయేది కేవలం 54వేల 120 రూపాయలు మాత్రమే.

ఇక నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం ప్రాంతంలో వైఎస్సార్​సీపీ కార్యాలయం కోసం రెండెకరాలు ఎకరాలను విజయవాడ - చెన్నై జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఈ స్థలం బహిరంగ మార్కెట్‌లో 2కోట్ల 88 లక్షలపైమాటే. కానీ వైఎస్సార్​సీపీ దీన్ని 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన 66 వేలకే ఎగరేసుకుపోతోంది. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణ పనులు సాగుతున్నాయి.

Jada Sravan Arrest News: విజయవాడలో జడ శ్రవణ్​కుమార్​ అరెస్ట్​.. పార్టీ శ్రేణులు ఆందోళనలు

తిరుపతి వైఎస్సార్​సీపీ జిల్లా కార్యాలయం కోసం విమానాశ్రయానికి అతి సమీపంలోని కుర్రకాల్వ పరిధిలో 2 ఎకరాలు కేటాయించారు. బహిరంగ మార్కెట్‌లో 8కోట్ల విలువైన ఈ భూమిని వైఎస్సార్​సీపీ 66 వేలు చెల్లించి 33 ఏళ్లపాటు అనుభవించనుంది. ఇక చిత్తూరు జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయం కోసం ఇరువారంలో రెండెకరాలు కేటాయించారు. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం బహిరంగ మార్కెట్‌లో కోటి 95 లక్షలు పలుకుతోంది. కానీ వైఎస్సార్​సీపీ దీన్ని 66వేల రూపాయలకే లీజుకు దక్కించుకోనుంది. గతేడాది ఈ స్థలాన్ని చదును చేస్తుండగా మాజీ కౌన్సిలర్‌ అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివాదాల వల్ల ప్రస్తుతం నిర్మాణ పనులు జరగడం లేదు.

కడప నగరంలో వైఎస్సార్​సీపీ కార్యాలయానికి కేటాయించిన 2 ఎకరాల భూమి విలువ మార్కెట్లో 10 కోట్ల వరకూ ఉంది. 33 ఏళ్లకు వైఎస్సార్​సీపీ దీనికి 66 వేలు కడితే సరిపోతుంది. ఇక అన్నమయ్య జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయానికి బహిరంగ మార్కెట్‌లో 4కోట్లు పలుకుతున్న ఎకరా 61 సెంట్లు కేటాయించారు. కానీ దీనికి చెల్లించబోయే లీజు 33 ఏళ్లకు కలిపి 53 వేల 130 మాత్రమే.

అభివృద్ధి జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి: శ్రీకాళహస్తి వైఎస్సార్​సీపీ నేతలు

కర్నూలు వైఎస్సార్​సీపీ కార్యాలయ నిర్మాణం అతి త్వరలో పూర్తికాబోతోంది. ఇందుకోసం నగరం నడిబొడ్డున అత్యంత విలువైన 5 రోడ్ల కూడలిలో ప్రభుత్వం ఎకరా 60 సెంట్ల కేటాయించింది. బహిరంగ మార్కెట్‌లో 6కోట్లు పలుకుతోంది. కానీ 52వేల 800 రూపాయల లీజు చెల్లించి వైఎస్సార్​సీపీ 33 ఏళ్లు అనుభవించనుంది. నంద్యాల జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన ఎకరా భూమి విలువ బహిరంగ మార్కెట్లో 2కోట్లు పలుకుతోంది. వైఎస్సార్​సీపీ దీనికి 33 సంవత్సరాలకు కలిపి 33 వేల రూపాయల లీజు మాత్రమే ఇవ్వనుంది.

అనంతపురంలో జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయానికి 2 ఎకరాలు కేటాయించగా బహిరంగ మార్కెట్‌లో దాని విలువ నాలుగుకోట్ల 30 లక్షలపైమాటే. కానీ వైఎస్సార్​సీపీ 66 వేల రూపాయలు చెల్లించి దీన్ని 33 ఏళ్ల లీజు అనుభవించబోతోంది. ఇక కొత్తగా ఏర్పాటైన సత్యసాయి జిల్లా వైఎస్సార్​సీపీ కార్యాలయాన్ని పుట్టపర్తిలో నిర్మిస్తున్నారు. దీనికి ప్రభుత్వం కేటాయంచిన 2 ఎకరాల విలువ బహిరంగ మార్కెట్లో 20కోట్లు వరకూ ఉంటుంది. కానీ వైఎస్సార్​సీపీ దీనికి 33 ఏళ్లకాలానికి 66 వేలు మాత్రమే చెల్లించబోతోంది.

వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో స్కీములన్నీ స్కాములే- వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు : చంద్రబాబు

ఇలా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కలిపి ప్రభుత్వం వైఎస్సార్​సీపీ కార్యాలయాల కోసం 43 ఎకరాల 60సెంట్లను కారుచౌకగా కేటాయించింది. కానీ బహిరంగ మార్కెట్‌లో ఆయా భూముల ధర 433 కోట్ల 84 లక్షల వరకూ ఉంటుంది. కానీ 33ఏళ్లకు కలిపి ప్రభుత్వానికి వైఎస్సార్​సీపీ చెల్లించేది కేవలం 14 లక్షల 71 వేల 760 రూపాలు మాత్రమే. కొత్త జిల్లాల్లో ప్రజల అవసరాలకు పనికొచ్చే ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్ల నిర్మాణాలు ఒక్కటీ మొదలు కాలేదు. కానీ వైఎస్సార్​సీపీ కార్యాలయాలు మాత్రం జగన్‌ శరవేగంగా కట్టేస్తున్నారు.

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీరని కలగా మిగిలిపోతున్న విశాఖ రైల్వేజోన్‌కు ఐదేళ్లుగా జగన్‌ భూమే కేటాయించలేదు. ఏపీ ప్రభుత్వం ఎప్పుడు భూములిస్తే అప్పుడు జోన్‌ కార్యాలయ పనులు ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవే స్వయంగా చెప్పారు. కానీ జగన్‌కు పార్టీ కార్యాలయాలపై ఉన్న శ్రద్ధ ప్రజోపయోగాలపై ఉంటే కదా. దీపం ఉండగానే ఇల్లుచక్కబెట్టుకోవడం అంటే ఇదేనేమో జగనన్నా.

బస్సు ఎక్కండి-డబ్బులు తీసుకోండి! సీఎం సభకు వచ్చే జనాలకు డబ్బులు పంచుతున్న వీడియో వైరల్

ABOUT THE AUTHOR

...view details