ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొబ్బిలి వీణకు ప్రభుత్వం ఆదరవు - ఇక సుస్వరాలు పదిలమే! - BOBBILI VEENA MAKING PROBLEMS

వాయిద్యాల తయారీకి పనస చెట్ల పెంపకం - ప్రభుత్వ ఆదేశాలతో కళాకారులు, వ్యాపారుల హర్షం

Bobbili Veena Making Problems
Bobbili Veena Making Problems (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2024, 10:39 AM IST

Bobbili Veena Making Problems :ప్రపంచ ప్రఖ్యాత బొబ్బిలి వీణ తయారీకి కష్టాలు తొలగనున్నాయి ముడిసరకు కొరత తీరనుంది. ఇక సుస్వరాలు పలకనున్నాయి. పనస చెట్లు పెంచాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వీణకు మంచిరోజులు రానున్నాయి. వందల ఏళ్ల చరిత్ర గల బొబ్బిలి వీణల తయారీకి ముడిసరకు కొరత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తోంది. దీంతో పొరుగు రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆర్థిక భారం పడుతుండడంతో పాటు పూర్తిస్థాయి సరకు రాకపోవడంతో సకాలంలో ఆర్డర్ల మేరకు కళాకారులు అందించలేకపోతున్నారు.

మరోవైపు పనులు లేక కుటుంబ పోషణ కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితులను హస్తకళల అభివృద్ధి సంస్థ సర్కార్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించింది. ప్రధానమైన ముడిసరకు కలప కోసం పనస చెట్లను ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విస్తారంగా పెంచాలని ఆదేశాలు ఇచ్చింది. ఉపాధి హామీ పథకంలో పనస మొక్కల పెంపకానికి నిర్ణయం తీసుకోవడంతో కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో ఖ్యాతి : ఇక్కడి వీణకు దేశ విదేశాల్లో ఎనలేని ఖ్యాతి గాంచింది. గత అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ప్రశంసలు, దిల్లీలో జరిగిన జీ-20 సదస్సులో ప్రాధాన్యం, విశాఖ గ్లోబల్‌ సమ్మిట్లో మన రాగం శ్రోతలకు ఆహ్లాదాన్ని పంచింది. సర్కార్ వీణకు గుర్తింపు ఇవ్వడంతో కళాకారులు సంతోషం వ్యక్తం చేశారు. నాడు బొబ్బిలి సంస్థానంలో కళాకారులు వీటిని తయారు చేసేవారు. వారి వారసులు నేటికీ కొనసాగిస్తున్నారు. కేంద్ర బృందం ఇటీవల వీణల కేంద్రాన్ని సందర్శించి చరిత్రను అధ్యయనం చేసింది. ఏడు సంవత్సరాల కిందట భౌగోళిక గుర్తింపు దక్కింది.

వీటికి డిమాండ్ :గిఫ్ట్‌వీణలకు మంచి గిరాకీ ఉంది. పెద్దవి కూడా ఇటీవల అమ్ముడవుతున్నాయి. రూ.4,000ల నుంచి రూ.40,000ల వరకు వీటి ధర పలుకుతోంది. హంస, నెమలి నమూనాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వాటినే ఇక్కడి కళాకారులు ఎక్కువగా తయారు చేస్తున్నారు.

చిరకాల సమస్యకు తెర : వీణ తయారీలో కలప కీలకమని కళాకారుడు సర్వసిద్ధి శంకరాచారి తెలిపారు. పనస వినియోగించడంతో రాగం బాగుంటుందని చెప్పారు. ముడిసరకు ధర పెరిగినా తప్పనిసరి పరిస్థితుల్లో దళారుల వద్ద కొంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వమే చెట్లను పెంచి చౌకగా అందిస్తే కళ బతుకుతుందని వివరించారు. సర్కార్ ప్రకటనతో సమస్యకు తెరపడనుందని ఆయన వెల్లడించారు.

పనస కలపతోనే తయారీ :బొబ్బిలి వీణను కేవలం పనస కలపతోనే తయారు చేస్తారు. దీని వల్ల రాగం మృదువుగా ఉంటుందని అనాదిగా ఈ కలపనే వినియోగిస్తున్నారు. పైగా ఏకండి వీణ తయారీ బొబ్బిలి ప్రత్యేకం. అవసరమైన ముడిసరకు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఒడిశా నుంచి దిగుమతి చేసుకునేందుకు కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్డర్లు వస్తున్నా అందించలేకపోతున్నారు. దూరాభారంతో తయారీ ఖర్చు పెరుగుతోంది. జిల్లాలో పనస చెట్లు పెంచాలని, కలప డిపో ఏర్పాటు చేసి రాయితీపై సరఫరా చేయాలని కళాకారులు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలను కోరుతున్నా స్పందనలేదు. కూటమి ప్రభుత్వం రావడంతో దీనికి మంచి రోజులు వచ్చాయి.

సకాలంలో అందించలేకపోతున్నాం :ఏటా వీణల తయారీ సంఖ్య పెరుగుతోందని బొబ్బిలి వీణల కేంద్రం ఇంఛార్జ్​ సర్వసిద్ధి రామకృష్ణ పేర్కొన్నారు. మరిన్ని ఆర్డర్లు వస్తున్నా ముడిసరకు కొరతతో సకాలంలో ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. ఇటీవల హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లామని చెప్పారు. ఆ మేరకు సర్కార్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని రామకృష్ణ వెల్లడించారు..

ఇదీ పరిస్థితి :

  • తయారుచేసే ప్రాంతాలు : గొల్లపల్లి, బొబ్బిలి, బాడంగి మండలం వాడాడ
  • కళాకారుల కుటుంబాలు : 100
  • పరోక్షంగా ఆధారపడిన వారు : 1500
  • తయారీ కేంద్రం ద్వారా ఏడాదికి విక్రయించేవి : 300 (చిన్నపెద్దవి కలిపి)
  • టర్నోవర్‌ : రూ.25 లక్షలు

కొండపల్లి కళాకారులకు పవన్​ శుభవార్త - ఆ చెట్లు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం

వీనుల విందుగా అఖండ కచ్ఛపీ మహోత్సవం

ABOUT THE AUTHOR

...view details