Drinking Water Problem in AIIMS Mangalagiri : గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ-ఎయిమ్స్‌కు నీటి సమస్య అతి త్వరలో తీరనుంది. ఆసుపత్రికి నీటి సరఫరా చేసే పైప్‌లైన్, పంప్‌హౌస్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఎయిమ్స్ అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాగానే పెండింగ్ బిల్లులు చెల్లించటంతో పాటు పనులు మళ్లీ ప్రారంభించారు. నవంబర్ నెలఖారుకు నీరివ్వాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో కేంద్రం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక సంస్థల్లో ఎయిమ్స్ ఒకటి. అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించే మంగళగిరిలోని ఎయిమ్స్‌కు నీటి సరఫరా విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీస సహకారం అందించలేదు. ఫలితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి. కూటమి ప్రభుత్వం రాగానే ఎయిమ్స్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. సమస్యను వివరించారు. తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
నవంబర్‌లో పూర్తికానున్న పనులు : సీఎం చంద్రబాబు చొరవతో రెండో దశ అనుమతులు వచ్చాయి. గుత్తేదార్లకు పెండింగ్ బిల్లులు చెల్లించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పనులు వేగంగా జరుగుతున్నాయి. నవంబర్ నెలాఖరుకు నీరందించాలన్న లక్ష్యంతో ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగం పనులు చేస్తోంది. నిత్యం వెయ్యిమందికి పైగా రోగులు వస్తున్న ఎయిమ్స్‌లో నీటి సమస్య వల్ల సేవలకు అంతరాయాలు కలుగుతున్నాయి. అందుకే నీటి సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటిదాకా రూ.5.48 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. 85 శాతం పనులు పూర్తయాయని మిగిలిన 15 శాతం పనులు నవంబర్‌లో చేస్తామని అధికారులు చెబుతున్నారు.