Lokesh on Deputy CM Post : సాక్షిపై పరువు నష్టం కేసు విచారణలో భాగంగా ఇవాళ విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. తనపై సాక్షి పత్రిక అసత్య ఆరోపణలు చేసిందంటూ ఆయన గతంలో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్‌కు లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అవతలి తరఫు లాయర్లు కోర్టుకు రాకపోవడంతో విచారణను వచ్చేనెల 28కి వాయిదా వేశారు.
కోర్టుకు హాజరైన అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. తనపై సాక్షి వేసిన వార్త తప్పు అని న్యాయపోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును లాజికల్‌గా ఒక తీరానికి చేర్చేవరకు పోరాటం ఆగదని చెప్పారు. ఎన్నిసార్లు వాయిదా వేసినా తాను వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కేసు జాప్యం కావచ్చేమోగానీ నిజం గెలుస్తుందని బలంగా నమ్ముతున్నట్లు స్పష్టం చేశారు.
ఈరోజు కూడా మంత్రి హోదాలో తాను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం తిన్నానని సర్కార్ నుంచి ఒక్క వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదన్నారు. వచ్చిన వాహనం కూడా తనదేనని సొంత డబ్బుతో డీజిల్ కొట్టించుకున్నట్లు వివరించారు. ఎక్కడా ప్రభుత్వంపై ఆధారపడకూడదని తన తల్లి భువనేశ్వరి చిన్నప్పటి నుంచి నేర్పించారని లోకేశ్ వ్యాఖ్యానించారు.
Lokesh on Vijayasai Reddy : ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై లోకేశ్ స్పందించారు. తాను టీడీపీలో ఒక కార్యకర్తనని చంద్రబాబు తనకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు కష్టపడతానని చెప్పారు. తన వల్ల పార్టీకి ఏనాడు చెడ్డపేరు రాకుండా చూసుకుంటానని వివరించారు. క్రమశిక్షణతో పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
"తల్లి, చెల్లిని నమ్మని జగన్ ఎవరినీ నమ్మరు. డబ్బుల కోసం పార్టీని అమ్మేసే రకం జగన్. ఇవన్నీ చూసే ఒక్కొక్కరుగా పార్టీని విడిచిపెట్టి వెళ్తున్నారు. టీడీపీ, కార్యకర్తలను విజయసాయిరెడ్డి ఇబ్బంది పెట్టారు. మా శ్రేణులను ఇబ్బందిపెట్టి పార్టీలోకి వస్తానంటే ఎందుకు తీసుకుంటాం? విశాఖలో విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలపై విచారణ జరుగుతోంది. గతంలో జరిగిన అన్ని అక్రమాలపై ఒక్కొక్కటిగా విచారణ చేస్తున్నాం. రెడ్‌బుక్ గురించి నేను చెప్పిన విషయం చాలా స్పష్టం. కేవలం చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై మాత్రమే చర్యలు." - లోకేశ్, మంత్రి
జగన్ హయాంలో భారీ విధ్వంసం - పారిశ్రామికవేత్తలు హామీ కోరుతున్నారు: లోకేశ్
దళితులపై జగన్ పాపాల చిట్టా రాజ్యసభ సాక్షిగా తెలిసింది: నారా లోకేశ్