Tulasi Babu Police Custody: ఉప సభాపతి, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబును పోలీసు కస్టడీ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు తరలించారు. తులసిబాబును 3 రోజుల పోలీసు కస్టడీకి జిల్లా కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ప్రకాశం జిల్లా పోలీసులు ముందుగా జీజీహెచ్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. తులసిబాబుకు బీపీ హెచ్చు తగ్గులు ఉండటంతో ఆసుపత్రిలోనే వైద్యం అందించారు. దాదాపు ఐదు గంటల పాటు తులసిబాబు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎకో, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సాయంత్రం ఐదురన్నగంటల సమయంలో తులసిబాబును ఒంగోలు తరలించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు తులసిబాబును పోలీసులు విచారించనున్నారు.
మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న తులసిబాబు, సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తులసిబాబును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌లో ఉంచారు. ఆదివారం నిందితులను గుర్తించే పరేడ్‌లో న్యాయమూర్తి సమక్షంలో తనపై దాడి చేసిన తులసిబాబును రఘురామకృష్ణరాజు గుర్తించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పోలీసు విచారణలో విలువైన సమాచారం రాబట్టే అవకాశం ఉంది.
HC On Tulasi Babu Bail Petition: మరోవైపు రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసి బాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నేటి నుంచి ఈనెల 29వ తేదీ వరకు తులసిబాబును పోలీస్ కస్టడీకి ఇస్తూ ఇటీవల దిగువ కోర్టు ఉత్తర్వులిచ్చింది. మూడు రోజుల పాటు తులసి బాబును పోలీసులు విచారించనున్నట్లు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 31కి న్యాయస్థానం వాయిదా వేసింది. రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టై ప్రస్తుతం గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తులసిబాబును విచారణ కోసం ఒంగోలుకు తరలించారు.
నన్ను కొట్టిన వ్యక్తిని గుర్తించా- రఘురామకృష్ణ రాజు
రఘురామ కేసులో జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ పిటిషన్ కొట్టివేత