Bed Shortage Problems in Vijayawada GGH : విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు త్వరలోనే మంచాల కొరత సమస్య తీరబోతోంది. గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ నిర్లక్ష్యానికి గురైన క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం కూటమి సర్కార్ చొరవతో తుది దశకు చేరుకుంది. మార్చి నెలాఖరు కల్లా ఈ నూతన బ్లాక్ అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి రానుంది.
విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ పెద్దఎత్తున గర్భిణులు వస్తుంటారు. ప్రతి నెలా 800, ఏటా తొమ్మిది వేల వరకూ ప్రసవాలు జరుగుతుంటాయి. వీటిలో అత్యధికంగా శస్త్ర చికిత్సలే ఉంటున్నాయి. చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రిల నుంచి క్లిష్టమైన కేసులన్నీ విజయవాడకే పంపిస్తున్నారు. తీరా ఇక్కడికి వస్తే మంచాలు లేక గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రఘురామ కేసులో జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ పిటిషన్ కొట్టివేత
2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆసుపత్రికి వచ్చి గర్భిణుల అవస్థలు చూసి చలించిపోయి అదనపు భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. 18 కోట్ల రూపాయలతో 2018లో నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ పనులను గాలికొదిలేసింది. దీంతో పునాదుల దశలోనే ఆ భవనం ఆగిపోయింది. గత ఐదేళ్ల జగన్ పాలనలో కనీసం గర్భిణుల అవస్థలు పట్టించుకోలేదు. మంచాల కొరతను తీర్చేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.
నూతన బ్లాక్ నిర్మాణం పూర్తి : ఎట్టకేలకు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం స్పందించి 23 కోట్ల 75 లక్షలు నిధులివ్వడంతో భవనాన్ని క్రిటికల్ కేర్‌గా మార్చి తిరిగి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. కూటమి సర్కార్ స్టేట్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తూ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో నిర్మాణం త్వరితగతిన పూర్తయింది. ప్రస్తుతం తలుపులు, కిటికీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు జరుగుతున్నాయి. కేంద్రం 50 మంచాలనే మంజూరు చేసినప్పటికీ దానిని ప్రస్తుతం 130కు పెంచారు. రెండు ఫ్లోర్లలో ఒక్కో దానిలో 65 మంచాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రతి బెడ్‌కు రెండు ఆక్సిజన్ లైన్లు, వెంటిలేటర్ ఏర్పాటు చేసేందుకు సౌకర్యాలుంటాయి. వీటితో పాటు నాలుగు ఆపరేషన్ థియేటర్లు, ఆల్ట్రాసౌండ్ రూం, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ సేవలందించేందుకు వైద్యులను అందుబాటులో ఉంచుతున్నారు. గర్భిణులు, బాలింతల కోసం ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు పాత ఆసుపత్రిలోనే ఉంటారు. దీంతో మాతా శిశుమరణాలు తగ్గించవచ్చు. ప్రతి మంచం వద్ద ICUకి ఉండే వసతులు కల్పిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ భవనం అందుబాటులోకి వచ్చాక గర్భిణులకు కష్టాలు ఉండవని తెలిపారు.
'ప్రభావతికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు' - ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన RRR
గుంటూరు జీజీహెచ్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఓవరాక్షన్ - రోగుల ఇబ్బందులు