AP Govt Decided to Set up Savings Societies for Men: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా గతంలో టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను విస్తృతం చేసింది. అయితే ఇదే క్రమంలో పురుషులకూ స్వయం ఉపాధికి అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత పట్టణాల్లో ఈ ప్రక్రియ చేపడుతుండగా భవిష్యతులో గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రవేశపెట్టనుంది. ఈ బాధ్యతను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)కు ప్రభుత్వం అప్పగించింది. 100 రోజుల ప్రణాళికలో భాగంగా గతేడాది నవంబరు మొదటి వారం నుంచి 2025 ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పురుషుల స్వయం ఉపాధికి సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
వీరే అర్హులు: సంఘాల్లో సభ్యులుగా చేరేందుకు పారిశుద్ధ్య, భవన నిర్మాణ కార్మికులు, జొమాటో, స్విగ్గీ వంటి వాటిలో ఉన్నవారు, రవాణా కార్మికులు (రిక్షా, సామగ్రి తీసుకెళ్లేవారు), కేర్‌టేకర్, ఏసీ, వాషింగ్‌మిషన్లు, ఫ్రిజ్, ఎలక్ట్రీషియన్లు, ఫ్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు (సర్వీస్ ప్రొవైడర్లు)ను గుర్తించి ఆసక్తిగలవారిని సంఘాలుగా ఏర్పాటు చేస్తారు. వృత్తి, నైపుణ్యం పెంపొందించేలా కృషి చేస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొలివిడతగా 299 సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది.
ఇలా ఏర్పాటు: కామన్ ఇంట్రస్ట్ గ్రూపు (సీఐజీ)గా పిలిచే వీటిలో ఐదుగురు సభ్యులుంటారు. వయో పరిమితి 18-59 ఏళ్లు. పట్టణ ప్రాంతాల్లో రిసోర్స్ పర్సన్లను సంప్రదించి ఐదుగురు లేదా 10 మంది సభ్యుల ఆధార్, తెల్లరేషన్ కార్డు తీసుకుని సంఘం ఏర్పాటు చేస్తూ తీర్మానం చేసుకోవాలి. ఆ వివరాలను మెప్మా కార్యాలయంలో అందజేయాలి. మెప్మా కార్యాలయాల్లో కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీవో), సిటీ మిషన్ మేనేజర్లు (సీఎంఎం) ద్వారా బ్యాంకుల్లో మొదటి, రెండో లీడర్ పేరున రూ.500తో ఖాతా ప్రారంభిస్తారు. ఒక్కో సభ్యుడు నెలకు కనీసం రూ.100 చొప్పున 6 నెలలపాటు పొదుపు చేయడం ఆరంభించాలి. 6 నెలల తర్వాత మెప్మా అధికారులు ఆ సంఘాలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల రుణం ఇప్పిస్తారు. ఆ మొత్తాన్ని సక్రమంగా చెల్లిస్తే రుణ పరిమితి రూ.75 వేల నుంచి రూ.1లక్ష వరకు పెరుగుతుంది.
కోనసీమ కొబ్బరికి మంచిరోజులొచ్చాయ్ - 9 వేల నుంచి 15 వేలకు పెరిగిన ధర