AP FIBERNET ISSUE REACHED TO CM CHANDRABABU: ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి సచివాలయంలో కలిశారు. ఫైబర్ నెట్ ఎండీ దినేష్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై జీవీ రెడ్డి వివరణ ఇచ్చారు. సంస్థలో గత, రెండు మూడు నెలల్లో జరిగిన పరిణామాలను సీఎం చంద్రబాబుకు వివరించారు.
ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు సమస్యను పరిష్కరించుకునే విధానం అది కాదని సీఎం చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది. సమస్యను ముందుగా మంత్రి దృష్టికి, ప్రధాన కార్యదర్శి దృష్టికి తేవాల్సిందని కదా అని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తన దృష్టికి ఈ అంశాన్ని తీసుకురాకుండా మీడియాకు ఎక్కడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం. శాఖలో ప్రక్షాళన చేయాలనే ఆలోచన మంచిదే అయినా దాన్ని సాధించుకునే విధానం కూడా బాగుండాలని సీఎం సూచనలు చేశారు.
ప్రభుత్వంలో ఛైర్మన్ పోస్టులో ఉండి ఐఏఎస్ అధికారులపై ఇటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వానికే చెడ్డపేరు తెస్తాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఇమేజ్ డామేజ్ అయ్యేలా ఎవరూ వ్యవహరించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ సమస్య ఉన్నా ఎవరైనా తన వద్దకు తీసుకురావాలి కానీ ఇలా రచ్చ చేయకూడదని గట్టిగా సూచించారు.
అధికారుల నుంచి వివరణ కోరిన మంత్రి: మరోవైపు ఇప్పటికే ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అధికారుల నుంచి వివరణ కోరారు. ఆ సంస్థ ఎండీ దినేష్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌లతో సమావేశమై ఈ అంశాలపై ఆరా తీశారు. జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎండీ దినేష్‌కుమార్‌ను ఆదేశించారు. అదే విధంగా ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని జీవీరెడ్డికి సైతం మంత్రి కార్యాలయం లేఖ రాసింది. రెండు రోజుల్లోగా మొత్తం ఆధారాలు సమర్పిస్తానని జీవీ రెడ్డి తెలియజేశారు.
జీవీ రెడ్డి వ్యాఖ్యలు:కాగాఏపీ ఫైబర్‌నెట్ సంస్థను పూర్తిగా కనుమరుగు చేసేలా అధికారులు కుట్రలు పన్నుతున్నారంటూ ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలసిందే. ఎండీ దినేష్ కుమార్ ఏపీ ఫైబర్‌నెట్ సంస్థను చంపేయాలనుకుంటున్నారంటూ ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలో చేరిన ఉద్యోగుల తొలగింపు విషయంలో ఎండీ దినేష్ వ్యవహార శైలిపై జీవీ రెడ్డి ఆక్షేపణ వ్యక్తం చేశారు. దీంతో ఎండీ దినేష్‌పై చేసిన వ్యాఖ్యల గురించి సీఎం చంద్రబాబును కలిసి జీవీ రెడ్డి వివరణ ఇచ్చారు.
ఫైబర్‌నెట్‌ను చంపేయాలనుకుంటున్నారా? - ముగ్గురు అధికారులు తొలగింపు : ఛైర్మన్ జీవీరెడ్డి
జీవీ రెడ్డి ఆరోపణలు - ఫైబర్‌నెట్ అధికారులతో మంత్రి జనార్దన్‌రెడ్డి భేటీ