ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్: నారా లోకేశ్ - AP DSC NOTIFICATION 2025

విద్యా సంవత్సరం ప్రారంభంలోనే భర్తీ - టీచర్ల బదిలీలో పారదర్శకత కోసం ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్ తెస్తున్నామని లోకేశ్​ వెల్లడి

Nara Lokesh
Nara Lokesh (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 4:57 PM IST

Nara Lokesh on AP DSC Notification 2025:రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనూ, నవ్యాంధ్రలోనూ 80 శాతానికిపైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందన్నారు. విద్యాశాఖ కమిషనర్‌ ప్రతి శుక్రవారం టీచర్ల సమస్యలు వింటున్నారని వివరించారు. టీచర్ల బదిలీ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని నిరూపిస్తున్నామని తేల్చి చెప్పారు. అందులో భాగస్వామ్యులైన వారందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటూ ప్రజాస్వామ్య విలువలు చాటుతున్నామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో మంత్రి నారా లోకేశ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

గుడ్​న్యూస్​ - త్వరలో 16,347 టీచర్​ పోస్టులకు నోటిఫికేషన్: సీఎం చంద్రబాబు

వైఎస్సార్సీపీ ఆందోళన విడ్డూరంగా ఉంది:జగన్ పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలపై వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనలు చేయటం విడ్డూరంగా ఉందని నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు రూ.3 వేల కోట్లు పెట్టి దిగిపోయారని, తాము విడతల వారీగా రూ.800 కోట్ల చెల్లింపులు చేశామని చెప్పారు. జగన్ రైతులకు పెట్టిన ధాన్యం బకాయిలు, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలు అన్నీ తామే తీరుస్తున్నామని వెల్లడించారు. అలాగే జగన్ పెట్టిన ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు తీర్చేది కూడా తామే అని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం గందరగోళం చేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థుల సంఖ్య ఖచ్చితత్వాన్ని తెలుసుకునేందుకు ఆపార్ కార్డ్ విధానం తెస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ ఔట్స్ నివారణకు ప్రత్యేక వ్యవస్థ తీసుకొస్తున్నట్లు వివరించారు.

6 నెలల్లో 520 సేవలు అందుబాటులోకి:వాట్సప్ గవర్నెన్స్​పై మంచి ఫీడ్ బ్యాక్ వస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అక్కడక్కడా చిన్నపాటి సమస్యలు ఉన్నా వారం రోజుల్లో పూర్తిస్థాయిలో 161 సేవలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. సాంకేతికత వినియోగంలో ఇదో విప్లవాత్మక మార్పు అనే చెప్పాలని అన్నారు. మరిన్ని మెరుగైన సేవలు తెచ్చేందుకు చట్ట సవరణలు సైతం చేస్తున్నామని తెలిపారు. 6 నెలల్లో 520 సేవలు అందుబాటులోకి తెచ్చి సుపరిపాలన దిశగా అడుగులు వేస్తామన్నారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత పెరిగి అవినీతి కూడా తగ్గుతుందన్నారు. వాట్సప్ గవర్నెన్స్ వాడితే వ్యక్తిగత సమాచారం బయటకు లీకయ్యే సమస్యే లేదని లోకేశ్ స్పష్టం చేశారు.

ఏపీలో 'వాట్సప్‌ గవర్నెన్స్‌' - దేశంలోనే తొలిసారి 161 సేవలకు శ్రీకారం

పార్టీ శ్రేణుల ఎదుగుదల కోసమే ఆ ప్రతిపాదన: నాయకులు, పార్టీ శ్రేణులు ఎదుగుదల కోసం ఒకే పదవిలో 3 సార్లు కంటే ఎక్కువ ఉండకూడదనే ప్రతిపాదన తెచ్చామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. దీనిపై విస్తృత చర్చ తర్వాత పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. గ్రామ స్థాయి నాయకుడు మండల స్థాయికి, మండలి స్థాయి వాళ్లు నియోజకవర్గ స్థాయికి, అక్కడి నుంచి జిల్లా స్థాయికి ఎదిగేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. తెలుగుదేశం సంస్థాగత నిర్మాణం ఎంతో గొప్పదని లోకేశ్ తెలిపారు. అధినేత మినహా ఈ విధానం తనతో సహా అందరికీ వర్తింపజేస్తేనే కొత్తతరం రాజకీయాల్లోకి వస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. 40 ఏళ్లుగా పార్టీ పటిష్ఠంగా పని చేస్తోందంటే అందుకు కారణం ఎన్టీఆర్ వేసిన బలమైన పునాదేనని ఉద్ఘాటించారు.

ఎక్కువమంది పోలీసులు ఉండటంపై ఆగ్రహం:తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో పోలీసుల అత్యుత్సాహంపై మంత్రి నారా లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో పోలీసులు ఎందుకు ఎక్కువ ఉన్నారంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారనే దానిపై అధికారులను ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో జరిగే పోలిట్ బ్యూరో సమావేశానికి ఇంతమంది పోలీసులు అవసరమా అని అధికారుల్ని నిలదీశారు. బందోబస్తు పేరుతో పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయొద్దని లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రతిరోజు కార్యకర్తలు వస్తారు కాబట్టి, ఇబ్బంది పెట్టవద్దంటూ లోకేశ్ హితవు పలికారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తలు సమస్యలపై వచ్చినప్పుడు పోలీసులు హడావుడితో వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.

రాష్ట్ర కార్యక్రమంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం:శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడానికి జగజ్జనని పరమేశ్వరి కన్యక అవతారం దాల్చారన్నారు. తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన వాసవీ దేవి ఆత్మార్పణ చేస్తూ అగ్నిప్రవేశం చేశారని తెలిపారు. యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని లోకేశ్ ఆకాంక్షించారు.

ఏపీలో నూతన శకం - వాట్సప్ గవర్నెన్స్‌కు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details