ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఈసీ వేటు - బదిలీ చేయాలని సీఎస్​కు ఆదేశాలు - EC TRANSFERRED DGP - EC TRANSFERRED DGP

Election Commission Transferred DGP: జగన్ భక్త అధికారిగా ముద్రపడిన ఇంఛార్జి డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై కేంద్రం ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. తక్షణం విధుల నుంచి వైదొలగాలని, తన దిగువ ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ఆయన స్థానంలో మరొకరి నియామకానికి ముగ్గురు డీజీ ర్యాంకు ఐపీఎస్‌ అధికారుల పేర్లు, వివరాలతో సోమవారం ఉదయం 11 గంటల్లోగా ప్యానల్‌ జాబితా సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. గత ఐదేళ్లలో వారి ఏపీఏఆర్‌ గ్రేడింగ్, విజిలెన్స్‌ క్లియరెన్స్‌ల వివరాలను ప్యానల్‌తో పాటు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిచ్చింది. ఈసీ ఆదేశాలతో రాజేంద్రనాథరెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులిచ్చారు.

Election_Commission_Transferred_DGP
Election_Commission_Transferred_DGP (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 6:24 PM IST

Updated : May 6, 2024, 7:54 AM IST

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఈసీ వేటు (ETV BHARAT)

Election Commission Transferred DGP: అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. పోలీసు దళాల అధిపతిగా ఉంటూ వైకాపా కార్యకర్తలా పని చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి ఆయన్ను బదిలీ చేసింది.

ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా రాజేంద్రనాథరెడ్డి అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయనే డీజీపీగా కొనసాగితే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగవని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి. ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదులపై చాలా ఆలస్యంగా స్పందించింది. ఎన్నికల్లో వైకాపాకు ప్రయోజనం చేకూర్చేలా ఆయన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికల సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది.

సీఎం జగన్‌ డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను పక్కన పెట్టేసి మరీ 2020 ఫిబ్రవరి 15న కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జి డీజీపీగా నియమించారు. రెండేళ్ల రెండు నెలలుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోం శాఖ పదే పదే లేఖలు రాసినా ఖాతరు చేయలేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన ఆదేశాలను పట్టించుకోలేదు. రాజేంద్రనాథరెడ్డి ‘తమవాడు’ కావటమే ఏకైక అర్హతగా సీనియార్టీ జాబితాలో అట్టడుగున ఉన్నా సరే ఆయన్ను డీజీపీగా నియమించారు.

కాయ్‌ రాజా కాయ్‌లో తేలిపోతున్న ఫ్యాన్‌ గాలి- అధికార మార్పిడిపై వెయ్యి కోట్లు బెట్టింగ్స్‌ - Election bettings on andhra pradesh

అంతేకాదు 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన రాజేంద్రనాథరెడ్డికి వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యంత కీలకమైన పోస్టింగులిచ్చింది. తొలుత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజీపీగా నియమించింది. తర్వాత నిఘా విభాగాధిపతిగా బాధ్యతలు అప్పగించింది. కొన్నాళ్లకు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా పంపింది. ఆ పోస్టులో ఉండగానే ఇన్‌ఛార్జి డీజీపీగా నియమించింది. దీనికి కృతజ్ఞత తీర్చుకోవటానికి అన్నట్లుగా ఆయన అధికార పార్టీ నాయకులు అరాచకాలకు తెగబడ్డా, అక్రమాలకు పాల్పడ్డా వెన్నుదన్నుగా నిలబడ్డారు. వైకాపాకు రాజకీయంగా గిట్టనివారిని అక్రమ కేసులతో వేధించారు. ప్రతిపక్షాలను తీవ్రంగా అణచివేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని వేధించారు. భౌతిక దాడులు చేసిన అధికార పార్టీ నాయకుల్ని వదిలేసి బాధితులపైనే రివర్స్‌ కేసులతో హడలెత్తించారు.

విపక్ష పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాలు చిన్న నిరసనకు పిలుపిచ్చినా వారిని గృహనిర్బంధం చేశారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టడం దీనికి పరాకాష్ఠ. అధికార పార్టీ నాయకులు తమ అరాచకాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలను దిగజార్చేస్తుంటే వారికి వత్తాసు పలికారు. ఐపీసీని పక్కనపెట్టి జేపీసీ కోడ్‌ అంటే జగన్‌ పీనల్‌ కోడ్‌ను అమలు చేశారు. సీఆర్‌పీసీ స్థానంలో వైఎస్‌ఆర్‌సీపీ అంటే వైఎస్‌ఆర్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ పాటించారు. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుచిత ప్రయోజనం కలిగించటం కోసం కరడుగట్టిన వైకాపా కార్యకర్తల్లా పనిచేసే వారిని కీలక స్థానాల్లో నియమించారు.

'చంద్రబాబుతో అమిత్​షా ఏమన్నారంటే!'- 'నెటిజన్ల స్పందన ఇదీ' - Hello AP Bye Bye YCP

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేతలపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టారు. ప్రతిపక్షాల వారిపై ఫిర్యాదులివ్వడానికి వచ్చే అధికార పార్టీ నాయకులను సాదరంగా ఆహ్వానించి, ఫిర్యాదులు స్వీకరించేవారు. వైకాపా నాయకుల దాష్టీకాలపై ఫిర్యాదులివ్వడానికి వెళ్లే ప్రతిపక్ష నాయకుల్ని కనీసం డీజీపీ కార్యాలయం లోపలికీ రానివ్వలేదు. దీనిపై ప్రశ్నించినందుకు ప్రతిపక్షాల వారిపై కేసులు పెట్టారు. 24 నెలల పదవీకాలంలో ఎన్నికల కోడ్‌ వచ్చాక మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో ఇటీవల ప్రతిపక్ష తెదేపా నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. రాజేంద్రనాథరెడ్డి వైకాపాకు ఎంత ఏకపక్షంగా పనిచేశారో చెప్పేందుకు ఈ ఒక్క ఘటన చాలు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులకు రాజేంద్రనాథరెడ్డి సహకరించలేదని, పైగా అరెస్ట్‌ చేయకుండా నిరోధించారన్న ఫిర్యాదులున్నాయి. డీజీపీ అన్ని నిబంధనల్ని ఉల్లంఘించి వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారని.... వైకాపా దురాగతాల్లో చాలావాటికి ఆయనదే మార్గదర్శకత్వం వహించారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన దొంగ ఓటర్ల నమోదుపై గానీ, దానికి కారకులైన వైకాపా నాయకులపైగానీ డీజీపీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే వరకు ప్రేక్షకుడిలానే వ్యవహరించారు.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక రాజేంద్రనాథరెడ్డి అధికార వైకాపా పట్ల మరింత స్వామిభక్తిని ప్రదర్శించారు. చిలకలూరిపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న బహిరంగ సభకు అవరోధాలు కల్పించే పన్నాగానికి ఆయన బహిరంగంగా సహాయపడ్డారన్న ఫిర్యాదులున్నాయి. మైక్‌ సిస్టమ్స్‌ దగ్గర సరైన భద్రత కల్పించలేదు. సభా ప్రాంగణంలోని స్తంభాలపైకి ఎక్కుతున్నవారిని పోలీసులు అడ్డుకోలేదు. ప్రధానమంత్రే జోక్యం చేసుకుని, వారిని స్తంభాలపై నుంచి దిగమని కోరాల్సి వచ్చింది. వైకాపా నాయకులు.. ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై దాడులకు తెగబడుతుంటే ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలను తగలబెట్టేస్తే కనీసం స్పందించలేదు. ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న ప్రతిపక్ష పార్టీల వారిని బెదిరిస్తూ, దాడులు చేస్తుంటే మౌనంగా ఉంటూ వాటన్నింటికీ పరోక్షంగా సహకరించారు. అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోలేదు సరికదా.. బాధితులైన ప్రతిపక్షాల వారిపైనే రివర్స్‌ కేసులు పెట్టారు. ఆయన అండదండలతో స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే సార్వత్రిక ఎన్నికల్నీ ఏకపక్షంగా మార్చేసేందుకు వైకాపా కుట్ర చేసిందని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. విచారణ జరిపిన ఎన్నికల సంఘం డీజీపీపై వేటు వేసింది.

ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు!: డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన ఆయన ప్రస్తుతం సీనియార్టీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానాల్లో రోడ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌, 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అంజనా సిన్హా, 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌ ఉన్నారు. కొత్త డీజీపీ నియామకం కోసం వీరి ముగ్గురి పేర్లు ప్యానల్‌ జాబితాలో పంపించే అవకాశం ఉంది. వీరు ముగ్గురిలో ఎవరినైనా వద్దనుకుంటే హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి హరీష్‌కుమార్‌ గుప్తా పేరు జాబితాలో చేరొచ్చు.

Last Updated : May 6, 2024, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details