Producer Dil Raju Reaction on Sandhya Theatre Incident : సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను దిల్ రాజు పరామర్శించారు. అనంతరం దిల్ రాజు కిమ్స్ ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు.
Dil Raju on Allu Arjun Issue : ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించారని గుర్తు చేశారు. తాను అమెరికాలో ఉన్నందున ఇన్ని రోజులు రాలేకపోయానని, అమెరికా నుంచి రాగానే సీఎంని కలిశానని, అల్లు అర్జున్‌ను త్వరలోనే కలుస్తానని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తున్నామని, దానికి త్వరలోనే ఫుల్‌స్టాప్ పెడదామని అన్నారు. సినీ పరిశ్రమ వారితో పాటు ప్రభుత్వ పెద్దలను త్వరలోనే కలిసి షరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని, చిత్ర పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, రేవతి భర్త భాస్కర్‌కు ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
అల్లు అర్జున్‌పై కేసును వెనక్కి తీసుకుంటాను: శ్రీ తేజ్ తండ్రి భాస్కర్
సీఎం రేవంత్‌ను కలుస్తాం : సంధ్య థియేటర్ ఘటన ఎవరూ కావాలని చేసింది కాదని దిల్ రాజు అన్నారు. ప్రమాదవశాత్తు జరిగిందని, చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతోందనేది దుష్ప్రచారమని తెలిపారు. ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే సినీ పరిశ్రమ ప్రతినిధులం వెళ్లి రేవంత్‌ను కలుస్తామని పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా చూసే బాధ్యత తనపై ఉందని ఆయన తెలిపారు. దిల్ రాజుతో పాటు డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి బాలుడిని పరామర్శించారు.
"సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటా. రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండే బాధ్యత నాది. సంధ్య థియేటర్ ఘటన ఎవరూ కావాలని చేసింది కాదు."- దిల్ రాజు, నిర్మాత
విచారణకు రండి - అల్లుఅర్జున్‌కు చిక్కడపల్లి పోలీసుల నోటీసులు