AP CM Jagan on Visakha Steel Plant Privatization :ఏపీలోనివిశాఖ ఉక్కుకు జగన్ మోహన్ రెడ్డి మళ్లీ మొండి చేయి చూపించారు. 'స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?' అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. ఆర్థికసాయం, సెయిల్‌లో విలీనం గురించి చెప్పేందుకు మూడేళ్లుగా కార్మిక, అధికారసంఘాల ప్రతినిధులు జగన్‌ను కలవాలని ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. కానీ, ఎన్నికల వేళ మంత్రి అమర్‌నాథ్ ద్వారా స్టీలుప్లాంటు కార్మికసంఘాల నేతలను పిలిపించారు. బస్సుయాత్రలో భాగంగా విశాఖలోని ఎండాడలో జగన్ బసచేసిన శిబిరం వద్ద ఉక్కు పరిరక్షణ పోరాటసమితి, అధికార సంఘం ప్రతినిధులు కొందరు ఆయనను మంగళవారం కలిశారు.
CM Jagan Response On Steel Plant Issue :విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ స్టీలుప్లాంటు వ్యవహారంపై స్పందించిన తీరుకు కార్మిక నేతలు నివ్వెరపోయారు. 'టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని ఓడించి గాజువాకలో అమర్‌నాథ్‌ను గెలిపించండి. వైసీపీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు స్టీలుప్లాంటు సంగతి చూస్తా' అని జగన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. గాజువాకలో వామపక్షాల అభ్యర్థి జగ్గునాయుడితో విత్‌డ్రా చేయించి అమర్‌నాథ్‌కు మెజారిటీ తెప్పించి అప్పుడు ప్లాంటు గురించి అడగాలని సూచించినట్లు సమాచారం.
ఇనుప ఖనిజం ఒడిశానుంచి తెప్పించవచ్చు :రాష్ట్రంలో స్టీలుప్లాంటుకు ఉన్న గర్భాం మాంగనీస్ గనులు, సారపల్లిలోని సిలికాన్ శాండ్ అనుమతుల గడువు పెంచాలని కార్మికసంఘాల నేతలు జగన్‌ను కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ 'స్టీలుప్లాంటులో ఇనుప ఖనిజం ఎక్కువ వాడతారు. తక్కువ వాడే మాంగనీస్, సిలికాన్ గురించి ఎందుకు? అది చిన్న అంశం' అంటూ గనుల లీజు పొడిగింపుపై ఏమీ చెప్పకుండా దాటేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఉక్కు పరిశ్రమకు అవసరమైన ఇనుప ఖనిజం ఒడిశా నుంచి తెప్పించవచ్చని జగన్ తెలిపారు.
విశాఖ ఉక్కు ఊపిరి తీశారు - మెడలు వంచుతామని కేంద్రం ముందు సాగిలపడ్డ జగన్